Hyderabad Water: హైదరాబాద్‌లో తాగునీటికి డోకా లేదు.. నాగార్జున సాగర్ ఎమర్జెన్సీ పంపింగ్

హైదరాబాద్ మహానగరానికి వేసవి నీటి కష్టాలు గట్టెక్కించేందుకు జలమండలి శ్రీకారం చుట్టింది. అందుకోసం నాగార్జున సాగర్ జలాశయంలో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలుపెట్టింది. 10 పంపులను ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.

Hyderabad Water: హైదరాబాద్‌లో తాగునీటికి డోకా లేదు.. నాగార్జున సాగర్ ఎమర్జెన్సీ పంపింగ్
Emergency Pumping From Nagarjuna Sagar
Follow us
Vidyasagar Gunti

| Edited By: Balaraju Goud

Updated on: Apr 20, 2024 | 8:19 PM

హైదరాబాద్ మహానగరానికి వేసవి నీటి కష్టాలు గట్టెక్కించేందుకు జలమండలి శ్రీకారం చుట్టింది. అందుకోసం నాగార్జున సాగర్ జలాశయంలో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలుపెట్టింది. 10 పంపులను ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నాగార్జున సాగర్ లో నగర తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించినట్లు ఎండి తెలిపారు. అవసరమైతే, రెండో దశ అత్యవసర పంపింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. నీటిలో తేలియాడే సబ్ మెర్సబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మే నెల 15 తేదీ నుంచి ఎల్లంపల్లి జలాశయంలో అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

ఆందోళన వద్దు!

ఇదే కాకుండా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాల్లో పుష్కలంగా నీరుందని, హైదరాబాద్ మహా నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. అవసరమైతే రెండు రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా తాగునీరు అందించడానికి జలమండలి సిద్ధంగా ఉందన్నారు. నీటి వినియోగదారులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎండీ విజ్ఞప్తి చేశారు.

ఇదిలావుంటే, నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో.. ఈ ప్రభావం హైదరాబాద్ తాగునీటి మీద పడకుండా. ఉండేందుకు ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ ప్రారంభించారు. చివరి సారిగా 2017 లో పంపింగ్ చేశారు. సాగర్ జలాశయంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీటిని సేకరిస్తున్నారు. అక్కడ నీటిని శుద్ధి చేసి.. వాటిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

ఓఆర్ఆర్ వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగర వాసుల తాగునీటి అవసరాల కోసం జలమండలి సరఫరా చేస్తోంది. నాగార్జున సాగర్ జలాశయం, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ – 1, 2, 3 ద్వారా రోజుకి 270 ఎంజీడీల నీటిని తరలిస్తోంది. ఈ లెక్కన నెలకు 1.38 టీఎంసీల నీటిని సరఫరా చేస్తుంది. అయితే ఏఫ్రిల్ 20వ తేదీ నాటికి నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 127.630 టీఎంసీ, 507.600 అడుగులు ఉంది. గతేడాది ఇదే రోజున 156.670 టీఎంసీలు, 524.000 అడుగుల నీరు ఉంది.

గతేడాదితో పోలిస్తే అధికం

ఈ ఏడాది నగరానికి సరఫరా చేసే సామర్థ్యం 2600 ఎంఎల్డీలకు పెంచారు. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం 175 ఎంఎల్డీల అదనపు నీటిని సరఫరా చేస్తురు. ఈ నీటిని ప్రధానంగా బోర్ వెల్స్ ఎండిపోయిన ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఏఫ్రిల్15వ తేదీ నుంచి హిమాయత్ సాగర్ నుంచి అదనంగా 7 ఎంజీడీల నీటి సరఫరా చేస్తున్నట్లు జలమండలి పేర్కొంది. వచ్చే నెల 15 నుంచి మరో 30 ఎంఎల్డీల అదనపు నీరును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఏఫ్రిల్ 10వ తేదీ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి 5 ఎంఎల్డీల నీరు సరఫరా చేశారు. రెండు మైక్రో ఫిల్టర్స్ ను ఆక్టివేట్ చేశారు. వచ్చే నెల 5 నుంచి మరో 4 మాడ్యులర్ నీటి శుద్ధి కేంద్రాల ద్వారా 12 ఎంఎల్డీల నీటిని సరఫరా చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…