Hyderabad: భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పై అనుమానాస్పదంగా యువకుడు.. పోలీసులు అతని బ్యాగ్ చెక్ చేయగా
మిట్ట మధ్యాహ్న సమయం.. ప్లేస్ ఎర్రగడ్డ భరత్ నగర్ ఫ్లై ఓవర్.. సుమారు 20 ఏళ్ల ఉన్న ఓ యువకుడు ఫ్లై ఓవర్‌పై ఓ బ్యాగుతో నిల్చుని ఉన్నాడు. చుట్టూ ఎవరూ లేకపోయినా కంగారు పడుతున్నాడు. దూరం నుంచి చూస్తున్న పోలీసులకు అతడి మీద అనుమానం కలిగింది. వెంటనే వెళ్లి వివరాలు అడిగారు...
ఎన్నికల నేపథ్యంలో కాస్త టెన్షన్ కనిపించిన ఏ వ్యక్తిని వదలడం లేదు పోలీసులు. ఈ క్రమంలోనే సనత్ నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరత్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద ఓ యువకుడు బ్యాగులో అనుమానాస్పదంగా కనిపించడంతో.. వివరాలు ఆరా తీశారు. అతడు తత్తరపాటు గురవ్వడంతో పాటు వివరాలు సరిగ్గా చెప్పకపోవడంతో.. బ్యాగు ఓపెన్ చేసి చూపించాలని సూచించారు. దీంతో ఆ యువకుడు పారిపోయేందుకు యత్నించాడు. పట్టుకుని బ్యాగు ఓపెన్ చేయగా.. గంజాయి గుప్పుమంది. అతని వద్ద నుంచి రూ.57,500 విలువ చేసే 2.3 కిలోల గంజాయిని ఎస్‌ఓటీ బాలానగర్ టీమ్ , సనత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీకాకుళానికి చెందిన బచ్చల లోకేష్‌గా గుర్తించారు. ఆపై అతడిని రిమాండ్‌కు తరలించారు. ఏపీలోని సోంపేటకు చెందిన గంజాయి సరఫరాదారు నరేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
లోకేష్ ఏపీలోని శ్రీకాకుళం నుండి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి మోతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇంటి నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌లో గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉన్నందున.. తెచ్చి అమ్మితే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే సోంపేట వెళ్లి గంజాయి సప్లై చేసే నరేష్ అనే వ్యక్తిని కలిశాడు. అతని వద్ద గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడి కూలీలకు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అనూహ్య రీతిలో పోలీసులకు పట్టుబడ్డాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..