మోదీ 11 ఏళ్ల పాలనపై వికసిత్ భారత్ బుక్ రిలీజ్.. ధర్మేంద్ర ప్రధాన్ కీలక కామెంట్స్
పీపుల్ సెంట్రిక్ పాలసీ తమ విధానం.. అవినీతి రహిత, పారదర్శక పాలన తమ లక్ష్యమంటున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన.. మోదీ 11 ఏళ్ల పాలన సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని కొనియాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి మరి

హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌లో మోదీ 11 ఏళ్ల పాలనపై వికసిత్ భారత్ బుక్ రిలీజ్ చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. చారిత్రక, ప్రాచీన సంస్కృతీ కల్గిన భాష తెలుగు అంటూ కొనియాడారు. ప్రధాని మోదీది 11 ఏళ్ల పాలన సువర్ణ అధ్యాయమన్నారు. సేవా, సంక్షేమం తమ లక్ష్యం, పాలనను ప్రజలతో మమేకం చేసి వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. తాము చేపట్టిన పథకాలు, పనులతో భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఆత్మ నిర్భర భారత్, వికసిత్ భారత్ తమ నిబద్ధత అంటూ ప్రకటించారు. గత పదేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తే మూడోసారి అధికారంలోకి రాగానే 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రం ఒక రూపాయి ఇస్తే లబ్ధిదారునికి చేరే వరకు అది 15 పైసలు అయ్యేది, మోదీ హయాంలో రూపాయి ఇస్తే లబ్ధిదారుని ఖాతాలో రూపాయి జమ అవుతుందన్నారు. ఉగ్రదాడుల తర్వాత నిమిషాల వ్యవధిలోనే భారత మిలటరీ సామర్ధ్యాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశామన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వంటి ఎన్నో విద్యాసంస్థలను దేశంలో నెలకొలిపామన్నారు. తెలంగాణకు IIM ప్రతిపాదన ఉంది, దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో మరింత ముందు ఉండటం దేశానికి మంచి పరిణామమన్నారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేసినట్లు ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు.