Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమచారం. ఈ క్రమంలో అరుణ్ నుంచి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడీ అభియోగం మోపింది. గత మార్చి 7న ఈడీ అధికారులు పిళ్లైని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అంతేకాకుండా పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారడం ఆసక్తి రేపుతోంది.
వాస్తవానికి అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారడం ఇదేం కొత్త కాదు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా మారి స్టేట్‌మెంట్ ఇచ్చిన పిళ్లై.. ఆ తర్వాత బలవంతంగా అప్రూవర్ గా మారేలా చేశారంటూ మాట మార్చారు. ఈడీ బలవంతంగా వాంగ్మూలం తీసుకుందని.. అదంతా తప్పంటూ పిళ్లై మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అదేసమయంలో ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈడీ అధికారులు తన వద్ద బలవంతంగా సంతకం చేయించుకున్నారని.. ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించారని.. అదంతా ఫేక్ అంటూ వివరించారు. అయితే.. తాజాగా పిళ్లై మరోసారి అప్రూవర్‌గా మారి కోర్టులో స్టేట్‌మెంట్ ఇవ్వడం.. సంచలనంగా మారింది.
అయితే, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటి వరకూ అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువ మంది సౌత్ గ్రూపునకు చెందిన వారే ఉన్నారు. దీనిలో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, దినేష్ ఆరోరా ఉండగా.. తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ.. పలువురిని విచారిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబును సైతం ఈడీ ఇటీవల విచారించింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు? కీలకంగా వ్యవహరించింది ఎవరు? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
అయితే, సౌత్ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు వరుసగా అఫ్రూవర్స్‌గా మారడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అప్రూవర్లు ఇచ్చిన సమాచారంతో లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..