Trump Road: హైదరాబాద్‌లోని ఆ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు.. ఎక్కడో తెలుసా?
గ్లోబల్ సిటీగా పేరొందచిన హైదరాబాద్- అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రత్యేక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామాకరణం చేయాలని నిర్ణయించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేసిన ఈ సరికొత్త రోడ్డును ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇంతకూ ఆ రోడ్డు ఏదో తెలుసుకోవాలి అంటే ఈస్టోరీ చదవాల్సిందే.

హైదరాబాద్- అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి, భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో కలిసి ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించనున్నారు. గత ఏడాది నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అంతర్జాతీయ భాగస్వామ్యాలకు గుర్తింపుగా ఈ పేరును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ-అమెరికా మధ్య పెరుగుతున్న వాణిజ్య, సాంకేతిక, పెట్టుబడి సంబంధాలకు ఈ నిర్ణయం ప్రతీకగా నిలుస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో అమెరికాకు చెందిన పలు ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌ను తమ కార్యకలాపాల కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. గత రెండేళ్లలో అనేక అమెరికన్ కంపెనీలు నగరంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మరింత బలపడుతోంది.
ఇదే తరహాలో భవిష్యత్తులో నగరంలోని మరికొన్ని ప్రధాన రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక సంస్థల పేర్లు పెట్టే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల పేర్లను రోడ్లకు కేటాయించే ప్రతిపాదనలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
ఇటీవల విడుదలైన ‘జీసీసీ ల్యాండ్‌స్కేప్ రిపోర్ట్ 2026’ ప్రకారం, 2025లో దేశంలో ఏర్పాటైన కొత్త బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లలో సగం హైదరాబాద్‌లోనే స్థాపించబడ్డాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఇందుకు ప్రధాన కారణాలుగా నివేదిక వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




