కలవరపెడుతున్న షిగెల్లా వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు, మరణాలు.. ఆరోగ్య శాఖ హై అలర్ట్!
కేరళంలో షిగెల్లా ఇన్ఫెక్షన్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. మలప్పురం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలుడు మృతి చెందడంతో రాష్ట్రంలో షిగెల్లా కారణంగా నమోదైన మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్ధారిత, అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది.

కేరళంలో షిగెల్లా ఇన్ఫెక్షన్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. మలప్పురం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలుడు మృతి చెందడంతో రాష్ట్రంలో షిగెల్లా కారణంగా నమోదైన మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్ధారిత, అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది.
ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం జూన్ 14 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 138 నిర్ధారిత షిగెల్లా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు కోజికోడ్ జిల్లాలో వెలుగుచూశాయి. అదనంగా 77 అనుమానిత కేసులు కూడా నమోదయ్యాయి. కేవలం జూన్ నెలలోనే 62 నిర్ధారిత కేసులు, 17 అనుమానిత కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి తీవ్రతను సూచిస్తోంది.
ప్రస్తుతం కోజికోడ్, వయనాడ్, మలప్పురం, అలప్పుజ, పతనంతిట్ట, ఆరన్ముళ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాలు, పాఠశాల భోజనశాలలు, తాగునీటి వనరులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆహార భద్రతా విభాగాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది.
షిగెల్లా అంటే ఏమిటి?
షిగెల్లా అనేది ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా. ఇది “షిగెల్లోసిస్” అనే పేగు సంబంధిత ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. చాలా తక్కువ మొత్తంలో బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ.
షిగెల్లా లక్షణాలు ఇవే..
తీవ్రమైన విరేచనాలు
జ్వరం
కడుపు నొప్పి
వికారం, వాంతులు
తరచూ మలవిసర్జన చేయాలనిపించడం
రక్తం లేదా శ్లేష్మంతో కూడిన విరేచనాలు
లక్షణాలు సాధారణంగా బ్యాక్టీరియా సోకిన 1 నుంచి 3 రోజులలో కనిపిస్తాయి. పిల్లల్లో డీహైడ్రేషన్ త్వరగా సంభవించే అవకాశం ఉండటంతో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
ఎలా వ్యాపిస్తుంది?
షిగెల్లా ప్రధానంగా “మల-నోటి” (Fecal-Oral) మార్గం ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన నీరు, ఆహారం, సరిగా చేతులు కడుక్కోకపోవడం, కలుషిత ఉపరితలాలను తాకడం ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. పాఠశాలలు, హాస్టళ్లు, పిల్లల సంరక్షణ కేంద్రాలు వంటి రద్దీ ప్రదేశాల్లో వ్యాప్తి వేగంగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలుః
టాయిలెట్ ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి.
బయట ఆహారం తీసుకునేటప్పుడు పరిశుభ్రతను గమనించాలి.
పండ్లు, కూరగాయలను బాగా కడిగి వినియోగించాలి.
పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
విరేచనాలు ఎక్కువగా ఉండటం, రక్తంతో కూడిన మలం, అధిక జ్వరం, వాంతులు, నీరసం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అయితే కేరళంలో పెరుగుతున్న షిగెల్లా కేసులు పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, ఆహార భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం సాధ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
