7 అడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ!
తన ఎత్తు కారణంగా విధుల్లో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని ఆర్టీసీ బస్ కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీ గురించిన వార్తలు గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ఎక్స్ వేదికగా బంపరాఫర్ ఇచ్చారు..

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల పొడవుతో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి అమీన్ అహ్మద్ అన్సారీ గత వారం రోజులుగా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాడు. బస్సు ఎత్తుకు మించి పొడవు ఉండటంతో విధులు నిర్వహించడం సవాల్‌గా మారిందని, తరచూ బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని వాపోయాడు. 195 సెం.మీ. ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటం వల్ల మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో హాస్పిటల్స్చుట్టూ తిరగాల్సి వస్తోందని తన గోడు విన్నవించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏడడుగుల కండక్టర్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అతడికి ఆర్టీసీలోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కండక్టర్‌కు వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను మంత్రి పొన్నం ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అతనికి సరైన మరో ఉద్యోగం ఆర్టీసీ లో ఇవ్వగలరు @SajjanarVC గారికి ఆదేశం
– మీ పొన్నం ప్రభాకర్ https://t.co/zadYYAMYhM
— Ponnam Prabhakar (@Ponnam_INC) April 6, 2025
కాగా హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్న అమీన్ అహ్మద్ అన్సారీ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఆయన అనారోగ్యంతో 2021లో మరణించారు. దీంతో కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడు అమీన్ అహ్మద్ అన్సారీ అప్పటికే ఇంటర్ పూర్తి చేసి ఉండటంతో సర్కార్ అతడికి మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది. అయితే సుమారు ఏడడుగుల పొడవున్న అమీన్ అహ్మద్ అన్సారీకి బస్సులో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది. ఎత్తు కారణంగా బస్సుల్లో రోజూ విధులు నిర్వహించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో అతడికి ఆర్టీసీలోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం గమనార్హం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.