Che Guevara daughter: విప్లవ శిఖరం చేగువేరా కుమార్తె గురించి మీకు తెల్సా.. హైదరాబాద్‌కు ఉద్యమ దివిటీ తనయ
తండ్రి ఆస్తుల కోసం పోరాడే ఈరోజుల్లో తండ్రి ఆశయాల్ని తన ఆశయాలుగా మార్చుకుని ముందుకు నడిచే లైఫ్‌సైజ్ ఫిమేల్ లీడర్లు ఎంతమంది ఉంటారు... వేళ్ల మీద మాత్రమే లెక్కబెట్టగలిగే అటువంటి ధీరవనితల్లో ఒకరు అలైదా గువేరా... డాటరాఫ్ చెగువేరా.

ప్రశ్నించే గొంతుకలూ, గట్టిగా నిలదీసే నాయకులూ ఎక్కడైనా కనిపిస్తే ఇప్పటికీ వాళ్లలో ఒక సారూప్యతను చూడ్డం అలవాటు. ఒక యోధుడితో పోల్చడం ప్యాషన్. ఆ యోధుడి పేరే చె గువేరా. అర్జెంటీనా వారియర్… క్యూబా విప్లవానికి ఆద్యుడు… అరివీర పోరాట నాయకుడు చెగువేరా. ఆ పేరులోని ఆ నాలుగక్షరాల్నీ పలికితే చాలు.. పిడికిలి బిగుసుకోవడం, నెత్తురు ఉడుకెత్తడం ఇప్పటికీ చూస్తుంటాం. క్యూబా అనే చిన్న దేశం గుండెకు కొండంత ధైర్యం చెగువేరా. అగ్రరాజ్యం అమెరికాతోనే ఢీకొట్టి నిటారుగా క్యూబా వెనక నిలబడ్డ బాహుబలి చెగువేరా. బతికింది 39 ఏళ్లే ఐనా… కొన్ని జెనరేషన్ల పాటు ఉడుకు నెత్తుటికి ప్రతీకగా నిలిచారు. అర్జెంటీనాలో ఒక మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలో పుట్టి… అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి.. పాతికేళ్ల వయసుకే యుద్ధవీరుడిగా ఎదిగిన అతడు ఒక నడిచే ఆయుధం. 33 ఏళ్ల వయస్సులో క్యూబా పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. కానీ.. పదవిని వదిలిపెట్టి విప్లవాన్ని పంథాగా మార్చుకున్నారు. పెరుగుతున్న పేదరికాన్ని, జరుగుతున్న దోపిడీల్ని ఓర్వలేక… పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. దక్షిణ అమెరికాలో సమస్యలకు సాయుధ ఉద్యమమే మార్గమని నమ్మి, ఎర్ర సైన్యాన్ని కూడగట్టి ఉద్యమాలు నడిపించారు. ఇప్పుడు ఆయన కూతురు అలైడా గువేరా… నాన్న దివిటీని పట్టుకుని… పోరాటం మొదలుపెట్టి… మన దేశంలోకి… నేరుగా మన భాగ్యనగరానికి వస్తున్నారు.
ఈనెల 22న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్న అలీడా గువేరా.. ఇప్పుడు యూత్ సెక్టార్‌లో హాట్‌టాపిక్‌గా మారారు. అలైడా నేపథ్యమేంటి, ఆమెకూ ఇండియాకూ కనెక్షనేంటి… మన దేశానికి ఆమె ఎందుకొస్తున్నట్టు…? చెగువేరా రెండోభార్య నలుగురు సంతానంలో మొదటి అమ్మాయి అలీదా. వారంలో ఒక రోజు సమాజం కోసం పనిచేయాలనేది అప్పట్లో క్యూబాలో అమలౌతున్న నిబంధన. చెగువేరా తన పిల్లల్ని కూడా సమాజంలోకి పంపి… శ్రమజీవన సౌందర్యానికి అలవాటుపడేలా చేశాడు. ఆవిధంగా సివిక్ సెన్స్‌ని వంటబట్టించుకుని అర్జెంటీనా, అంగోలా, ఈక్వెడార్‌లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, బ్రెజిల్‌లో పేదల పక్షాన భూపోరాటాల్లో యాక్టివ్‌గా పనిచేశారు. చెగువేరా జీవితచరిత్రతో వచ్చిన పుస్తకం ‘మోటార్ సైకిల్ డైరీస్’లో కూడా ఆయన పెద్ద కూతురు ప్రస్తావన ఉంది.
డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉంటూనే మానవహక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నారామె. తాను రాసిన విప్లవ సాహిత్యం కూడా యువతను స్పూర్తినిస్తోంది. క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్‌గా ఉన్నారు. తన సామ్యవాద భావజాలానికి మద్దతు కూడగడుతూ ఇండియా టూరేశారు. కేరళ, తమిళనాడు, వెస్ట్‌బెంగాల్‌తో పాటు తెలంగాణాలో కూడా పర్యటిస్తున్నారు. ఇదే టూర్‌లో భాగంగా చెన్నైలో మార్కిస్ట్స్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న చేగువేరా తనయ ఎమోషనల్ సాంగ్‌తో… నాన్న జ్ఞాపకాల్ని పంచుకున్నారు. కమ్యుూనిస్టులతో కలిసి నడుస్తున్న కాంగ్రెస్, వీసీకే, ఎమ్‌డీఎంకే నేతలు కూడా ఈ సభలో పాల్గొన్నారు. చేగువీరా కూతురిని డాటరాఫ్ యోధ అని కాంప్లిమెంట్ ఇచ్చారు కరుణానిధి కూతురు కనిమొళి. చేగువీరాని కలిసి ఆయనతో తన భావాల్ని పంచుకోవాలని అప్పట్లో తన తండ్రి తాపత్రయ పడ్డారని గుర్తు చేసుకున్నారు కనిమొళి.
నవశకంలో సైతం క్యూబన్ల బతుకు పోరు కొనసాగుతోందని, అమెరికా పెడుతున్న ఆంక్షలతో ఇప్పటికీ క్యూబా కునారిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తారు చెగువేరా కూతురు. బొలీవియాలో నాన్న చేగువేరా పాశవిక హత్యకు గురయ్యేనాటికి నాకు ఏడేళ్లే. కానీ.. ఒక యోధుడి కూతురిగా వెయ్యేళ్ల పాటు గర్వపడతాను… ఎందుకంటే… నా నరాల నిండా నాన్నగారి ఆశయాలే… అంటారామె. చెగువీరా ఎక్కడున్నా, తన పిల్లల్ని మరచిపోలేదు. పోస్టుకార్డుపై బొమ్మలు గీసి, ఇన్‌స్పిరేటివ్ కథలు రాసి పోస్టు చేసేవాడు. వాటిని చదువుతూ పెరిగిన అలైడా… తను కూడా విప్లవ పంథా ఎంచుకున్నారు. అణగారిన వర్గాల బాధల్ని అర్థం చేసుకుంటూ పెరిగారు. చాచా నెహ్రూ జైలునుంచి రాసిపంపిన లేఖలు చదివిన ఉక్కుమహిళ ఇందిరాగాంధీ కూడా తనకు ఆదర్శమంటారు డాటర్ ఆఫ్ చెగువేరా.
పోరాట సమయంలో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మూడునెలలు పర్యటించిన చేగువీరా… అప్పట్లో ఇండియాకొచ్చి కోల్‌కతాలో బస చేశారు. ఇప్పుడాయన కూతురి వంతు. క్యూబన్ విప్లవం అరవయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2019లో కూడా ఇండియాకొచ్చిన అలైడా గువేరా… తాజా ఇండియన్ టూర్‌లో తన భావజాలాన్ని ఇంకాస్త గట్టిగా ప్రదర్శిస్తున్నారు. 22న రాబోతున్న ధీరుడి ప్రతిరూపం అలైదా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది భాగ్యనగరం.

Dr. Aleida Guevara, daughter of Che Guevara
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం