Deccan Mall: ముగ్గురిని బలిగొన్న డెక్కన్‌మాల్.. విషమంగా ఫైర్ సిబ్బంది పరిస్థితి.. ఆ పొగ ప్రాణాంతకం అంటున్న వైద్యులు..
డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో నిన్నటి నుంచి ఆచూకీ లభించని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా బూడిదయ్యాయి. మృతదేహాలను గుర్తించేందుకు

సికింద్రాబాద్‌లోని డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో నిన్నటి నుంచి ఆచూకీ లభించని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా బూడిదయ్యాయి. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దంతాలు తప్ప మరేమి దొరికే అవకాశం లేదంటున్నారు అధికారులు. ప్రమాదంలో వసీం, జునైద్, జహీర్ మిస్ అయ్యారు. మృతులు బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు అధికారులు. కాగా, డెక్కన్ మాల్ ప్రమాదం నుంచి బయటపడ్డ కూలీలను విచారణకు పిలిచారు రాంగోపాల్ పేట స్టేషన్ పోలీసులు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.
ప్రాణాల మీదకు తెచ్చుకున్న అధికారులు..
నగరం నడిబొడ్డున భారీ అగ్నిప్రమాదం.. సమాచారం అందగానే.. పరిగెత్తుకుంటూ వచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అధికారులు. ఫైర్ ఆఫీసర్స్ ధనుంజయరెడ్డి, నర్సింగరావు.. ఇద్దరికీ డ్యూటీ అంటే అంకితభావం. ఎక్కడ ప్రమాదం జరిగినా.. రెస్క్యూ ఆపరేషన్స్‌లో ఎప్పుడూ దూకుడుగా ఉండేవారు.
నిన్న డెక్కన్‌మాల్ ప్రమాదంలోనూ ప్రాణాలకు తెగించి థర్డ్ ఫ్లోర్‌లోకి వెళ్లారు. అక్కడ చిక్కుకున్న నలుగురిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. మరో ముగ్గురు ఉన్నారన్న సమాచారంతో మళ్లీ లోపలకు వెళ్లారు. అక్కడ ఉన్న గ్లాస్‌ను పగలగొట్టారు. అప్పటికే ఆవహించి ఉన్న పొగ.. ఒక్కసారిగా వాళ్లను కమ్మేసింది. ఊపిరాడకుండా చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడ నుంచి కిందకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పొగను పీల్చేయడంతో.. వాళ్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతానికి ఆ ఇద్దరు అధికారులకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. నర్సింగ్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఎంఐసీయూ లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.




బయటకు వెళ్లొద్దు..
సికింద్రాబాద్ ప్రమాదంపై భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పొగ తీవ్రత జనం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఈ ఘటనతో సైకలాజిగల్, ఎమోషనల్ సమస్యలు రావొచ్చు, కొంత మంది డిప్రెషన్‌కు వెళ్లే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. దీని ప్రభావం కొంత మందిపై జీవిత కాలం ఉంటుందని అంటున్నారు వైద్యులు. అగ్ని ప్రమాద ఘటన ప్రభావం కిలోమీటర్ల మేర ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. వారం రోజులు జాగ్రత్తలు పాటించడం అవసరం అంటున్న వైద్యులు.. బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి వాతావరణం కాలుష్యం అవుతుందని చెప్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..