Holiday: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మే 28న సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వాలు..
దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో బక్రీద్ పండుగ తేదీ మారింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మే 27 స్థానంలో మే 28న బక్రీద్ సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉండనుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్ (ఈద్ అల్-అధా) పండగ సెలవుదినాన్ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. పాత క్యాలెండర్ ప్రకారం మే 27 2026 ఉండగా.. ఆ సెలవును మే 28, 2026 (గురువారం) నాటికి మారుస్తూ రేవంత్ సర్కార్ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ బక్రీద్.. ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన ధు అల్-హిజ్జా 10వ రోజున వస్తుంది.. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. ముస్లిం పండుగలు చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటాయి. అయితే.. ఈ సారి దుల్ హిజ్జా (Dhul-Hijjah) నెలవంక దర్శనం ఒకరోజు ఆలస్యం కావడంతో పండుగ తేదీ మారింది. అనుకున్న రోజు తర్వాత చంద్రదర్శనం అవ్వడంతో.. పండుగను ముందుగా అనుకున్న మే 27 కంటే.. ఒకరోజు తర్వాత మే 28న నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు బక్రీద్ సెలవు తేదీని మార్చాయి.. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక క్యాలెండర్‌లో మే 27న బక్రీద్ సెలవు ప్రకటించగా.. దానిని 28కి మారుస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి..
28న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు సెలవు..
తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పండుగ సెలవును 28కి మార్చింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 (N.I. Act) ప్రకారం మే 28వ తేదీని సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు, బ్యాంకులకు సెలవు ఉండనుంది.
ఇదిలాఉంటే.. మే 28న సెలవు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 28 సెలవు ఉండనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
