Babu Mohan: బాబూ మోహన్ న్యూ పొలిటికల్ జర్నీ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మాజీ మంత్రి..
ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, అందోల్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ఇటీవల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. రాష్ట్ర విభజనకు ముందు 15 ఏళ్లకు పైగా టీడీపీలో ఉన్న బాబూమోహన్.. తాజాగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలుపుతూ ఫొటో విడుదల చేశారు.
ఉమ్మడి ఏపీలో మంత్రి… మూడుసార్లు అందోల్ ఎమ్మెల్యే.. అంతకు మించి ఒకప్పటి స్టార్ కమెడియన్.. ఇలా బాబూమోహన్ ట్రాక్ గురించి చెప్పుకొంటూ పోతే చాలానే ఉంటది. ఈయన పేరుచెబితే.. తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు.. అయితే.. ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ అంతా అనుకున్నట్లుగానే సొంత గూటికి చేరారు.. బాబూమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన ఓ ఫొటోను విడుదల చేశారు. తాను సభ్యత్వం తీసుకున్న ఫొటోను బాబూమోహన్ మంగళవారం విడుదల చేశారు. కాగా, ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆగస్టులో బాబూమోహన్ సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో భేటీ సమయంలో బాబుమోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీలో మళ్లీ చేరుతానంటూ పేర్కొన్నారు. అయితే.. ఈ సమయంలోనే సభ్యత్వాలు ప్రారంభమవ్వడంతో బాబూమోహన్ టీడీపీ సభ్యత్వం తీసుకుని ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు తెలంగాణ పై కూడా ఫోకస్ పెట్టడంతో బాబూ మోహన్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇప్పటివరకు బాబూమోహన్ టీడీపీ నుంచి టీఆర్ఎస్.. ఆతర్వాత బీజేపీ, ప్రజాశాంతి పార్టీల్లో కొనసాగారు. రాష్ట్ర విభజనకు ముందు 15 ఏళ్లకు పైగా టీడీపీలో ఉన్న బాబూమోహన్.. మళ్లీ సొంత గూటికి చేరడం ఆసక్తికరంగా మారింది.
బాబూ మోహన్ ట్రాక్ ఇదే..
సినిమాల్లో ఓ ఊపు ఊపిన బాబూమోహన్… ఉమ్మడి రాష్ట్రంలో 1998లో అందోల్‌లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అందోల్ నుంచి మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి జాక్‌పాట్ కొట్టారు. చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. కానీ, ఆ తర్వాత వరుస ఓటములతో డీలాపడ్డారు బాబూమోహన్. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో మళ్లీ గెలిచారు. అయితే కారణాలేవైనా.. 2018లో బాబూమోహన్‌కు టిక్కెట్టివ్వకుండా చంటి క్రాంతి కిరణ్‌కు అందోల్ టిక్కెట్టిచ్చారు కేసీఆర్. దీంతో, బీజేపీ నుండి బరిలో నిలిచి ఓడిపోయారు బాబుమోహన్. 2023లో కూడా బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయారు.. 2023 ఫిబ్రవరిలో బీజేపీకి రాజీనామా చేసి కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. అనంతరం వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా కుదరలేదు. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..