Nampally Cong vs MIM: రాష్ట్రమంతా వేరు.. గ్రేటర్‌లో వేరు.. ఫ్రెండ్లీ పార్టీల మధ్య పొసగట్లేదా..?
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓల్డ్‌సిటీ పరిధిని తన సొంతం చేసుకున్న ఎంఐఎం... ఎవరు అధికారంలో ఉంటే వారివైపు వాలిపోతుందన్న అపవాదును మోస్తోంది.
ఆకాశంలో ఎగురుతున్న గాలిపటానికి.. భూమ్మీదున్న చేయికి ఏంటి సంబంధం అంటే ఏం చెబుతాం. అట్టాగే ఉంటుంది కాంగ్రెస్, మజ్లిస్‌ల దోస్తానా. చేతిలో కైటుందో…. కైట్ చెప్పినట్టు చేయి ఆడుతుందో… ఎవరికీ అర్థం కాదు. అలాంటి స్నేహంలో.. అక్కడ మాత్రం రెండు పార్టీల మధ్య బడబాగ్నిలా రగులుతోందట. ఆఖరికి నేతలు ఒకరిమీదకు ఒకరు దూసుకెళ్లేదాకా వెళ్లిందట జగడం. ఇంతకీ అదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓల్డ్‌సిటీ పరిధిని తన సొంతం చేసుకున్న ఎంఐఎం… ఎవరు అధికారంలో ఉంటే వారివైపు వాలిపోతుందన్న అపవాదును మోస్తోంది. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎంఐఎంను ఫ్రెండ్లీ పార్టీగా చెబుతోంది కాంగ్రెస్. అయితే, నాంపల్లిలో మాత్రం.. ఈ ఫ్రెండ్లీ పార్టీ మధ్య అస్సలు పొసగట్లేదు. స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్… కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్… మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
చాలా రాజకీయ పార్టీల్లో పనిచేసి, చివరకు కాంగ్రెస్‌లో ఫిక్సయిన ఫిరోజ్‌ఖాన్.. అక్కడ మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. గతంలో హైదరాబాద్ మేయర్‌గా పనిచేసిన మాజీద్ హుస్సేన్… మరోసారి నాంపల్లిలో ఎంఐఎం జెండా ఎగరేశారు. అప్పట్నుంచీ ఇద్దరు నేతలు ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య తగాదాలు.. గ్రేటర్‌లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అంశం ఏదైనా సరే.. బస్తీమే సవాల్ అంటూ.. కొట్టుకోడానికి ఎగబడిపోతున్నారు మాజీద్, ఫిరోజ్. రాజకీయంగా ఎదిగే ప్రయత్నం ఒకరిదైతే… సాధించిన గెలుపును సుస్థితం చేసుకోవాలన్న ప్రయత్నం ఇంకొకరిది. దీంతో, అక్కడ పొలిటికల్ పరిస్థితులు.. శాంతిభద్రతలకు విఘాతంగా మారి, పోలీసులకు తలనొప్పిగా మారాయి.
నాంపల్లి అడ్డా నాదంటే, నాదంటూ ఈ ఇద్దరు నేతలు చేస్తున్న ఆధిపత్య యుద్ధం… ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఎవరున్నా ప్రభుత్వం చెప్పిందే ఫైనలంటూ ఆ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. నాంపల్లి కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో, మజ్లిస్‌తో సమరానికి సై అంటున్నారు ఫిరోజ్. అటు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ సైతం.. ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ఇద్దరు నేతలకు.. హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా ఫర్వా నై అంటున్నారు.
కొన్నాళ్ల క్రితం మజీద్ హుస్సేన్ తన అనుచరులతో కలిసి ఫిరోజ్ గాంధీ నగర్‌లోని సిసి రోడ్డుకు సంబంధించిన సివిల్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అదే సమయంలో, కాంగ్రెస్ ఫిరోజ్ ఖాన్ కూడా తన అనుచరులతో అక్కడకు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి… ఒకరిపైకి ఒకరు దూసుకునేంత వరకూ వెళ్లింది. దీంతో, స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేయాల్సొచ్చింది. ఈ అంశంలో, ఇరువురు నాయకులను పిలిచి మాట్లాడిన ఎస్‌ఎహ్‌ఓ కమిషనర్ … ఇలాంటి రెచ్చగొట్టే చర్యల నుండి దూరంగా ఉండాలని కఠినంగా హెచ్చరించారు.
ప్రొటోకాల్ రచ్చే వీరిద్దరి మధ్య జగడం ముదరడానికి కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తనకు హక్కుందని మాజీద్ హుస్సేన్ చెబుతుంటే… అధికార పార్టీ తరపున, ఎక్కడికైనా వచ్చే రైట్ తనకూ ఉందన్నది ఫిరోజ్ వాదన. ప్రస్తుతానికి, పోలీసుల హెచ్చరికలతో మెత్తబడ్డ ఇద్దరు నేతలు.. మున్ముందు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. నాంపల్లిలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న కసితో ఉన్న ఫిరోజ్.. తనమాటే నెగ్గాలన్న పట్టుదలతో మాజీద్ హుస్సేన్.. వెరసి అంతర్గతంగా రగులుతున్న ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..