Chiranjeevi: విజయానికి నిలువెత్తు రూపం.. ట్రేడ్‌ వర్గాలే అంచనా వేయలేకపోయిన ‘స్టార్’!

మెగాస్టార్‌ చిరంజీవి.. ఈపేరు తెలియని తెలుగువారుండరు. తెలుగు సినీ చరిత్ర అనే పుస్తకరంలో ఆయనకు ఒకటి కాదు.. చాలా పేజీలే ఉన్నాయి. మూడు దశాబ్దాలు మకుటం లేని మహారాజుగా తెలుగు సినిమాని ఏలారు.

Chiranjeevi: విజయానికి నిలువెత్తు రూపం.. ట్రేడ్‌ వర్గాలే అంచనా వేయలేకపోయిన 'స్టార్'!
Chiranjeevi
Follow us

|

Updated on: Oct 29, 2024 | 9:04 PM

చిరంజీవి ‘స్టార్‌’ ఎప్పుడయ్యారసలు? బహుశా ఇండస్ట్రీ దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదేమో. టైటిల్స్‌లో చిరంజీవి అనే పేరుకు ముందు.. సుప్రీం హీరో, మెగాస్టార్‌ అనే స్టేటస్‌ ఎప్పుడొచ్చింది అని అడిగితే.. ఇదిగో ఫలానా సినిమా తరువాత, ఫలానా రికార్డుల తరువాత ‘స్టార్‌’ ఇమేజ్‌ వచ్చిందని చెబుతుంటారు కొందరు. ఖైదీ తరువాత చిరంజీవి ఫేట్‌ మారిపోయిందని, ఘరానా మొగుడు రికార్డులు కొల్లగొట్టిందని.. కొన్ని సినిమా పేర్లు చెప్పి చిరంజీవి స్టేటస్‌, స్టామినా చెబుతుంటారు. కాని, ఇవేవీ సమాధానాలు కావు. చిరంజీవి ఎప్పుడు స్టార్‌ అయ్యారో, ఎవరికీ తెలీదంటారు. ఓ ఎగ్జాంపుల్‌ చెబుతా.

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేందుకు కొందరు వచ్చారు. అప్పట్లో.. ఆ రోజుల్లో.. సూపర్‌ స్టార్స్‌ ఎవరయా అని అడిగితే.. కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా కొందరి పేర్లు చెబుతున్న రోజులవి. సినిమాలంటే వాళ్లవే. రికార్డులంటే వాళ్లవే. జనం థియేటర్లకు క్యూకట్టేదీ వాళ్ల సినిమాలకే. అలాంటి రోజుల్లో.. ఇండస్ట్రీ సూపర్‌స్టార్స్‌గా పిలుచుకుంటున్న టైమ్‌లో కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన సినిమా రిలీజ్‌ అయింది. ఆ సినిమా పేరు ముందడుగు. మామూలుగా సింగిల్‌ హీరో నటించిన సినిమాకే బంపర్‌ కలెక్షన్‌ వస్తున్న టైమ్‌ అది.

అలాంటిది కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన సినిమా ‘ముందడుగు’. ఆ సమయంలో చిరంజీవి జస్ట్‌ అప్‌కమింగ్‌ యాక్టర్.. అంతే. కానీ, విచిత్రం ఏంటో తెలుసా కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన సినిమా కంటే కూడా చిరంజీవి నటించిన ఓ సినిమానే ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ అయింది. అదే ‘ఖైదీ’. చాలా మంది అంటుంటారు.. ఖైదీ సినిమా చిరంజీవి ఇమేజ్‌నే మార్చేసింది అని. ఖైదీ తరువాత చిరంజీవి ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు అని. బట్.. ముందడుగు సినిమా కంటే ఎక్కువ థియేటర్లలో విడుదలైన సినిమా.. ఖైదీ. అంటే.. ట్రేడ్‌ వర్గాలకే అంతుచిక్కని విధంగా అప్పటికే ‘స్టార్‌’ ఇమేజ్‌ సాధించేశారు చిరంజీవి. మెగాస్టార్‌ చిరు గురించి చెప్పడమంటే.. రెండు కళ్లతో చూడలేనంత పెద్ద శిఖరాన్ని అద్దంలో చూపించినట్టే. అయినా సరే.. ఆ మెగాస్టార్‌ 50 ఇయర్స్‌ లెజండరీ జర్నీని ఓ 15 మినిట్స్‌లో చెప్పుకుందాం ఇవాళ్టి ఎక్స్‌క్లూజివ్‌లో.

సినిమా డైలాగ్‌లా అనిపించినా సరే.. ఓ డైలాగ్‌ చెప్పుకోవాలిక్కడ. సంఘర్షణ, పోటీ లేకుండా దక్కిన విజయం విజయమే కాదసలు. ఈ రెండూ లేకుండానే పైకి ఎదిగిన వాళ్లు.. తాము లైఫ్‌లో సక్సెస్‌ను చూశాం అని చెప్పుకోకూడదు. పోటీని తట్టుకుని, సంఘర్షణలో రాటుదేలితే వచ్చే సక్సెస్సే అసలైన విజయం. అలాంటి విజయానికి నిలువెత్తు రూపం.. చిరంజీవి.

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

చిరంజీవికి ముందు, చిరంజీవికి తరువాత. ఇలా గీత గీసి చెప్పొచ్చా అంటే ఇండస్ట్రీ పెద్దల కోణంలో కచ్చితంగా చెప్పొచ్చు. ఏడాదికి ఓ పది సినిమాలు చేస్తూ.. అందులో మూడు నాలుగు సినిమాల్లో సక్సెస్‌ చూస్తూ.. లైఫ్‌ని హ్యాపీగా లీడ్‌ చేస్తున్న ఎంతో మంది స్టార్‌ హీరోల జీవితంలోకి.. ‘చిరు’ తుఫాన్‌లా వచ్చారు. ఎలా పడితే అలా సినిమా తీస్తే కాదబ్బా.. ఇలా చేస్తేనే జనం చూస్తారు అనే ఓ మార్పు మొదలైంది.. చిరంజీవితోనే. అందుకే, ఖైదీ రిలీజ్ అయ్యాక.. జస్ట్‌ నాలుగేళ్లలోనే ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. ఆ తరువాత ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చారు. పేర్లు అక్కర్లేదు గానీ అలా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో కొందరు సినీవారసులు కూడా ఉన్నారు. చిరంజీవికి తామే పోటీ అనుకున్న ఆ వారసులు కూడా పూర్తిగా వెనకబడిపోయారు చిరు తుఫాన్‌ ముందు. ముఖ్యంగా 1987 నుంచి 1992 వరకు చిరుకి తిరుగే లేదు. చిరుతో పోటీ పడే లోపే.. చిరంజీవి వాళ్లందరినీ దాటుకొని వెళ్లిపోయారు. ఇండస్ట్రీలో ఇంత ఫాస్ట్‌గా ఎదిగిన హీరో మరొకరు ఉండరు. అందులోనూ సినీ కెరీర్‌కు తనకు తానే పునాదిరాళ్లు వేసుకుని, స్వయంకృషితో పైకొచ్చి, తెలుగు సినీ పరిశ్రమలోని దేవుళ్లకు సైతం ఇంద్రుడు అనిపించుకున్నది చిరంజీవి ఒక్కరే. 78లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. 81లో హీరోగా మొదటి హిట్ కొట్టి.. 83లో ఇండస్ట్రీకే అతిపెద్ద హిట్ ఇచ్చి.. 87కే నెంబర్ వన్ స్టేటస్ సాధించి, 92 వచ్చే సరికి.. ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడిగా ఎదిగారు. 1987 తరువాత చిరు ఎంత ఎదిగారో కొలిచి చెప్పాలంటే ఒకే ఒక్క సెంటెన్స్‌లో చెప్పొచ్చు. మరే హీరోకి కూడా చిరుకి ఉన్న మార్కెట్‌ వాల్యూలో సగం కూడా లేదు అనాడు. దటీజ్ చిరు.

1992లోనే దేశంలో కోటి 25లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక సూపర్ స్టార్ చిరంజీవి. ‘The Week’ మ్యాగజైన్‌ కవర్‌ పేజీలో BIGGER THAN BACCHAN అని చిరంజీవి ముఖచిత్రంతో జాతీయస్థాయిలో ఆర్టికల్ రావడమే ఇందుకు ఉదాహరణ. దాసరి నారాయణరావు 90ల్లో నడిపిన శివరంజని సినీ వారపత్రికపై.. 1978 An unknown Chiranjeevi.. 1998 A well known Mega Star అనే కవర్ పేజీ రాశారు. కానీ.. 1988కే చిరంజీవి తెలుగులో మోస్ట్ సేలబుల్ హీరో అయిపోయారు. ఆయన కాల్షీట్ ఇస్తే నిర్మాత భాగ్యలక్ష్మీ బంపర్ ఆఫర్ కొట్టినట్టే. టేబుల్ ప్రాఫిట్ అనే మాట నిర్మాత చూసింది చిరంజీవి టైమ్ లోనే. చిరంజీవి సినిమా విడుదల అంటే వారం ముందు.. వారం తర్వాత మరో సినిమా వచ్చే పరిస్థితులు. అంతటి క్రేజ్ జస్ట్‌ పదేళ్లలోనే సాధించడం ఆయన కెరీర్ ఉచ్ఛస్థితికి నిదర్శనం.

చిరంజీవి చేసిన సినిమాలు జస్ట్ 150+. వందల సినిమాల్లో నటించినా రానంత స్టార్‌ ఇమేజ్‌ అప్పటికి వంద కూడా చేయని చిరంజీవికే ఎలా వచ్చింది. మాస్‌ ఆడియన్స్‌ అనే డిఫినేషన్‌ను క్రియేట్‌ చేసింది చిరంజీవే కాబట్టి. ఓసారి చిరంజీవి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే.. ఓ పెద్దావిడ చిరంజీవిని ఆపి.. ఇంకొక్కసారి ‘డాడీ’లాంటి సినిమా చేయొద్దని చెప్పిందట. ఏడుస్తూ, నిస్సహాయంగా ఉంటే చూడలేకపోయాం అని చెప్పిందావిడ. మాస్‌ పల్స్‌కు మీనింగ్‌ ఇదీ. ఓ మహిళ, అందులోనూ పెద్దావిడ.. చిరంజీవిని లార్జర్ దెన్ లైఫ్ పాత్రల్లోనే చూడాలనుకున్నారు. అదీ చిరంజీవి క్రియేట్‌ చేసిన మాస్‌ పల్స్. అదే సమయంలో సినిమాల్లో డ్యాన్స్‌కి క్రేజ్‌ వస్తున్న టైమ్‌ అది. వరల్డ్‌వైడ్‌గా డ్యాన్స్‌కు రకరకాల పేర్లు పెట్టుకుని యువత ఉర్రూతలూగుతున్న సమయం అది. ఆ టైమింగ్‌ని క్యాచ్‌ చేసిన ఒకే ఒక్క హీరో.. చిరంజీవి. డ్యాన్స్‌ అంటే కాళ్లు చేతులు ఊపడం కాదు.. అందులో ఈజ్‌ చూపించాలి అని ఇండస్ట్రీకి నేర్పిన ఘనుడు చిరంజీవి. మొన్న ఏఎన్నార్‌ అవార్డ్‌ ఫంక్షన్‌లో నాగార్జున ఏమన్నారో వినే ఉంటారుగా. చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్‌ చూసి, ఇండస్ట్రీకి రావొద్దు అనుకున్నారట నాగార్జున. దటీజ్ చిరంజీవి.

Venkatesh And Chiranjeevi

Venkatesh And Chiranjeevi

కొణిదెల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవి. ఆయన మ్యాజిక్‌ మొదలై 50 ఏళ్లైంది. 70 ఏళ్ల వయసుకి జస్ట్‌ కూత వేటు దూరంలో ఉన్నా సరే.. ఇప్పటికీ మెగాస్టార్‌ స్టేటస్‌, యాక్టింగ్‌లో అంతే ఈజ్. హా.. ఏముంది చిరంజీవిలో గొప్ప అంటుంటారు కొందరు. ఇమేజ్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. ఏడాదికో సినిమా తీసుకుంటూ.. సినీ లైఫ్‌ని అలా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారని అంటుంటారు. బట్.. ఆయన డెడికేషన్‌కు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లు ఓ మాటచెప్పారొకసారి. ఇంత స్టార్‌డమ్‌ ఉన్నా కూడా.. తెల్లవారు జామున 3 గంటల వరకు వర్క్ చేసి.. నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఉదయం 7 గంటలకే ఉందని చెప్పినా సరే.. అరగంట ముందే షూట్‌కి రెడీ అయిపోతారట. ఏదో ఓ మాట అనేస్తే పోలా అనుకునే వారిలో ఇంత డెడికేషన్‌ ఉంటుందా? మెగాస్టార్‌ అనే ఈ నాలుగు అక్షరాలు ‘చీఫ్‌ మినిస్టర్‌’ అనే ఆరు అక్షరాల కంటే పవర్‌ఫుల్. అయినా సరే.. ఫలానా టైమ్‌కి ఫలానా లొకేషన్‌కు రావాలనగానే.. అంతే ఉత్సాహంతో పరుగులు తీస్తారు. తన ప్రొఫెషన్‌ అంటే అంత ప్యాషన్‌ చిరంజీవికి. సోకాల్డ్‌ ప్రొఫెషనల్స్‌కి తమ ప్రొఫెషన్‌ పట్ల అంత ప్యాషన్‌ ఉంటుందా? కష్టపడడం అంటే అంత ఇష్టం చిరంజీవికి.

చిరంజీవి కష్టం గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఫైట్ మాస్టర్ విజయరామరాజు చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలిక్కడ. ఫైట్స్ కోసం ఉదయం ఇంట్లోనే ప్రాక్టీస్ చేసి వస్తారు. ఈ దేశంలో మరే హీరో కూడా ఫైట్స్ కోసం అంత కష్టపడటం నేటికీ తాను చూడలేదంటారు. ఫైట్స్‌లో చిరంజీవి పరిచయం చేసిన వేగం.. ఇతర హీరోలకు ఓ రూట్‌మ్యాప్‌ అయింది. పునాది రాళ్లు సినిమాకి ఎంత కష్టపడ్డారో.. మొన్నటి భోళా శంకర్‌కి కూడా అంతే కష్టపడ్డారు. ‘నాకేం.. పెద్ద హీరోని.. ఇన్ని రికార్డులు వచ్చాయి.. ఎలా చేసినా జనం చూస్తారు’ అనుకునే హీరో కాదు. ఆత్మ విశ్వాసానికి, అతి విశ్వాసానికి మధ్య ఉన్న సన్నని గీతను ఎరిగి ప్రవర్తించే ఆయన తీరు అద్భుతం. దటీజ్.. చిరంజీవి.

హిట్టొస్తే పొంగిపోవడం.. ఫ్లాప్ వస్తే కృంగిపోవడం లేదు చిరంజీవి కెరీర్‌లో. తెలుగులో మరే హీరో కూడా చేయనన్ని శతదినోత్సవ, సిల్వర్ జూబ్లీ సంబరాలు బహిరంగంగా చేశారు చిరంజీవి. గ్యాంగ్ లీడర్ సినిమా శతదినోత్సవ వేడుకలు ఒకే రోజు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు నగరాల్లో జరిపిన రికార్డు దేశంలో మరే హీరోకి సాధ్యం కాలేదు. శతదినోత్సవ ఆనందోత్సాహాలు చూసి చిరంజీవి పొంగిపోయింది లేదు. అలాగే తన కోసం వచ్చే లక్షలాది మంది అభిమానులను చూస్తే ఎవరికైనా కించిత్ గర్వం కలుగుతుంది. కానీ.. శతదినోత్సవం జరిగిన రోజున ఇంట్లో కటిక నేలపై పడుకుని గర్వాన్ని గడప కూడా దాటనివ్వని హీరో చిరంజీవి.

పైగా స్టోరీ సెలెక్షన్‌లో చిరంజీవికి సాటిలేరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా తక్కువ సినిమాలకే మాస్‌ హీరోగా, మెగాస్టార్‌గా ఎదిగారంటే కారణం స్టోరీ సెలెక్షనే. ఇక్కడ కాస్త హిస్టరీ చెప్పుకోవాలి. అది మాస్టర్‌ సినిమా తీస్తున్న టైమ్. విజయేంద్ర ప్రసాద్.. రాజమౌళి తండ్రి.. ఓ కథ వినిపించారు. షెడ్యూల్స్‌ లేకనో ఏమో అప్పుడా కాంబినేషన్‌ కుదరలేదు. చూస్తూ చూస్తూనే 11 ఏళ్లు గడిచిపోయాయి. కాని, ఆ కథ మాత్రం మరిచిపోలేదు. మాస్టర్ సినిమా టైంలో విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ గుర్తు పెట్టుకొని.. 11 ఏళ్ల తర్వాత ఆయన్ను పిలిపించి.. రాజమౌళితో మరోసారి ఆ కథ విని.. ఓ సినిమా తీశారు. అదే మగధీర. రామ్ చరణ్‌కి తిరుగులేని స్టార్‌డం వచ్చేలా చేశారు. ఇక.. ఉప్పెన సినిమా ప్రివ్యూ చూసిన చిరంజీవి.. ఓన్ రిలీజ్ చేసుకోమని ప్రొడ్యూసర్స్‌కి సలహా ఇచ్చారట. అదీ చిరంజీవి జడ్జిమెంట్.

Chiranjeevi

Chiranjeevi

మెగా కుటుంబం నుంచి హీరో అవుతాను అని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్‌కి స్టార్ స్టేటస్ వచ్చేలా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడంలో స్పెషలిస్ట్ చిరంజీవి. కథల సెలక్షన్‌, కథలపై జడ్జిమెంట్‌ విషయంలో తిరుగులేదంతే. ఓ అభిమాని అంటాడు.. ఇండియా మొత్తం మీద ఒక కమర్షియల్ హీరో అవ్వాలనుకునే ప్రతి హీరో ఎలా నటించాలో, ఏమేం చేయాలో అనేదానికి చిరంజీవి ఓ లైబ్రరీ. కమర్షియల్ సినిమా జర్నీకి చిరంజీవిని మించిన ఎగ్జాంపుల్‌ పర్సన్ మరొకరు లేరు. అందుకే ప్రొడ్యూసర్ దిల్‌ రాజు అన్నారొకసారి. ఒక సినిమా కథ విని అందులో లోటు పాట్లను చెప్పగలిగే ‘స్క్రిప్ట్ డాక్టర్’ చిరంజీవి అని. ఇంత చెబుతున్నారు కదా.. మరి చిరంజీవికి అసలు ఫ్లాప్స్ అన్నవే రాలేదా అంటే.. వచ్చాయ్. చిన్న తడబాటు కారణంగా ఫ్లాప్స్‌ వచ్చి ఉండొచ్చు. కాని, ఒక్క మంచు బిందువు కరిగినంత మాత్రాన హిమనగo ఒరిగిపోదు.

కొండవీటిదొంగ సినిమాకు ముందు కొన్ని ఫ్లాపులు చూశారు చిరంజీవి. సో.. ప్రేక్షకులు ఏదో వైవిధ్యం కోరుకుంటున్నారని అర్ధం చేసుకున్నారు. ఫ్యాన్స్, ఇండస్ట్రీ సైతం వెయిటింగ్ ఆ మార్పు కోసం. అప్పుడు కొండవీటిదొంగలో బ్రేక్ డ్యాన్స్ బదులు చేసిన స్లో స్టెప్స్ వేశారు. చమ్మకు చమ్మకు చామ్ పాటలో చిరంజీవి పలికించిన భావాలు, స్లో డ్యాన్స్.. ఫ్యాన్స్, ఆడియన్స్‌ని పిచ్చెక్కించేశాయంతే. పాట ప్రారంభంలో కర్చీఫ్ తుడుచుకుంటూ అలవోకగా వేసే స్టెప్.. ఆ అందం.. ఆ గ్రేస్, ఆ ఈజ్.. చిరంజీవికి తప్ప భూమి మీద మరే నటుడికీ సాధ్యం కానిదంటారు సినీ పండితులు. శుభలేఖ రాసుకున్నా పాటలో కూడా చిరంజీవి గ్రేస్, స్లో డ్యాన్స్ ఇప్పటికీ ఓ మ్యాజిక్.. అంతే. డ్యాన్స్‌లో సిగ్నేచర్‌ స్టెప్‌ను క్రియేట్‌ చేసిన వన్‌ అండ్‌ ఓన్లీ.. మెగాస్టార్. ఇంద్ర సినిమాలో వీణ డ్యాన్స్‌ ఓ సిగ్నేచర్ స్టెప్. ఇప్పుడున్న స్టార్‌ హీరోలకు.. ఇప్పటి వరకు కూడా అలాంటి సిగ్నేచర్ స్టెప్‌ ఒక్కటి కూడా లేదు. దటీజ్ చిరంజీవి. అందుకేగా.. ఆయన డ్యాన్స్‌లకు గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సే తలదించుకుని మరీ వచ్చింది.

చాలా కష్టపడి పైకొచ్చిన హీరోలు అని.. ఇండస్ట్రీలోని కొంతమంది పేర్లు చెబుతుంటారు. సపోజ్.. రవితేజ, విజయ్ దేవరకొండ, నాని, శర్వానంద్, నిఖిల్, శ్రీవిష్ణు.. ఇలాంటి వాళ్లు. కాని, స్వయంకృషితో ఎంతమంది పైకొచ్చినా.. ఆ లిస్టులో మొదట చెప్పుకునే పేరు మాత్రం చిరంజీవే. ఒక హీరోగా ఎదగడానికి చిరంజీవి పడ్డంత కష్టం అలాంటిది మరి. మరే హీరో పడలేదు అంత కష్టం. అందుకే.. అగ్రస్థానం ఇచ్చి కూర్చోబెట్టింది ఇండస్ట్రీ. కాని, ఇంతపెద్ద కెరీర్‌లో ఓ అలజడి. అది కూడా అవార్డు రూపంలో వచ్చిన అలజడి. తెలుగు సినిమా పరిశ్రమకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2007లో జరిపిన వజ్రోత్సవాల్లో.. చిరంజీవికి లెజండరీ అవార్డు ఇవ్వాలనుకున్నారు. కాని, లెజెండ్‌ అనే పదానికి అర్థం ఏంటి అనే గలాటా మొదలైంది ఆ సమయంలో. స్వయంగా అమితాబ్‌ బచ్చన్‌నే చిరంజీవిని ‘కింగ్ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ అని కీర్తించారు. అయినా సరే.. లెజెండరీ అవార్డును చిరంజీవికి ఇస్తామనడంపై అభ్యంతరం చెప్పారు. సరే.. ఎవరి కారణాలు వాళ్లకున్నాయి. ఎవరి వాదన వాళ్లు వినిపించారనుకోండి. కాని.. రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోయానన్న చిరు మాటలకు అర్ధం మాత్రం ఇదే. ఆనాడు.. లెజండరీ అవార్డు అందుకోలేకపోవడమే. ‘నాడు తనకు దక్కలేదు’ అని చిరంజీవి చెప్పుకున్న ‘గెలుపు’ అదొక్కటే. ప్లే బైట్ః చిరంజీవి

నిజానికి రాజకీయాల్లో గెలుపు చూడాలనుకున్నారు. సినిమాల్లో సాధించిన సక్సెస్‌ను పాలిటిక్స్‌లోనూ రిపీట్ చేయాలనుకున్నారు. బట్.. అదొక్కటే చిరంజీవి లైఫ్‌లో ఫెయిల్యూర్. అఫ్‌కోర్స్‌.. ఇది తనకు సరిపడని రంగం అని చాలా త్వరగా తెలుసుకున్నారు కాబట్టే తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారనుకోండి. ఏదేమైనా.. ఓ బ్రేక్‌ ఇచ్చిన తరువాత కూడా అంతే క్రేజ్‌తో కెరీర్‌ను తీసుకెళ్తున్నందుకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే ఎవరైనా.

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

చిరంజీవి గురించి ఇంత చెప్పుకుంటున్నప్పుడు.. ఆయన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకోకపోతే కచ్చితంగా తప్పే అవుతుంది. జనరల్‌గా.. ఎంత పెద్ద సూపర్ స్టార్‌ అయినా కూడా.. వారి అభిమానులు, తమ అభిమాన హీరో పేరు మీద దానధర్మాలు, సేవా కార్యక్రమాలు చేశారే కానీ.. హీరోనే స్వయంగా సేవా రంగంలోకి దూకి.. అభిమానులను సేవా మార్గం వైపు మళ్లించిన ఘనత ఒక్క మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుంది. 1998 అక్టోబర్ 2న హైదరాబాద్ లో ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఇప్పటికి ఎందరికో రక్త, నేత్రదానాలు జరిగాయి. లక్షల్లో ప్రజలకు మేలు జరిగింది. అభిమానులు అంటే ధియేటర్లో అల్లరి.. కటౌట్లకు దండలు కట్టేవారు అనే మాటను చెరిపేసేలా.. చిరంజీవి తన పిలుపుతో అభిమానుల్ని సేవా మార్గం వైపు మళ్లించి వారికి తగిన గుర్తింపు వచ్చేలా చేశారు.

ముఖ్యంగా కరోనా సమయంలో కూడా తన తల్లిలాంటి పరిశ్రమలో కార్మికులు ఇబ్బందులు పడకూడదని.. కరోనా క్రైసిస్ చారిటీ-సీసీసీ ఏర్పాటు చేసి సినీ కార్మికులకు నాలుగు నెలలపాటు నిత్యావసరాలు అందించిన ఘనత చిరంజీవిదే. ఒక్క పిలుపుతో ఇండస్ట్రీ పెద్దలను కదలించి విరాళాలు సేకరించి దేశంలో మరే సినీ పరిశ్రమ చేయని విధంగా తెలుగు సినీ కార్మికులను ఆదుకున్నారు. ఇదంతా చిరంజీవిలోని సామాన్య మధ్యతరగతి వ్యక్తి నుంచి పుట్టిన ఆలోచనే. ప్రజలు ఆక్సీజన్ సిలిండర్లు అందక చనిపోకూడదనే భావనతో తానే రంగంలోకి దిగి.. సొంత ఖర్చుతో కోట్లు ఖర్చు చేసి.. తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి జిల్లాకో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసి.. ఆపదలో ఉన్నవారికి ఆక్సిజన్ సిలిండర్ అందజేసి ప్రాణాలు నిలబెట్టారు. కరోనాకు భయపడకుండా మెగాభిమానులే స్వయంగా కదిలి సిలిండర్ల సరఫరా చేయడం విశేషం.

ఫైనల్‌గా చిరంజీవి గురించి చెప్పాలంటే.. ఆయనొక వ్యక్తి కాదు. నాట్ జస్ట్ యాన్‌ యాక్టర్. నాట్ జస్ట్ ఏ క్యారెక్టర్. తెలుగు డిక్షనరీలో కొత్తగా ఓ పదాన్ని జోడించాల్సిన పేరు. దటీజ్ చిరంజీవి.

 మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్