మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయకుడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా మధ్యతరగతి వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్వయంకృషితో.. ఎన్నో సవాళ్లను, అవమానాలను ఎదుర్కొని నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. నటనపై అమితమైన ఇష్టం. నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటంతో అడ్డంకులను దాటుకుని హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చెన్నైలోని మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత 1978 పునాది రాళ్లు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. కానీ ప్రాణం ఖరీదు సినిమా ముందుగా రిలీజ్ అయ్యింది. చిరంజీవి మొదటగా తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 1,116. మనవూరి పాండవులు సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకు దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. 1983లో వచ్చిన ఖైదీ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మూవీతో చిరంజీవి క్రేజ్ మారిపోయింది. తొలినాళ్లలో ‘సుప్రీమ్ హీరో’గా పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత ‘మెగాస్టార్’ బిరుదు అందుకున్నారు. 1988లో ‘మరణ మృదంగం’తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు..