Telangana: మహిళా కాంగ్రెస్ ప్రక్షాళనపై పార్టీ ఫోకస్.. కొత్త ప్రెసిడెంట్ రేసులో ఉన్నదెవరు..?
కొత్త అధ్యక్షురాలి నియమకంపై పార్టీ పెద్దలు కసరత్తు మొదలుపెట్టారు. దీంట్లో సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ తానే కొనసాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే.. కొత్తవాళ్లు తమ ప్రయత్నాలను కూడా స్పీడప్ చేశారు. నాకు ఏదో ఒక పదవి ఇచ్చాకే, కొత్త వాళ్ళను పెట్టాలంటూ పేచీ పెడుతోందట ప్రస్తుత ప్రెసిడెంట్.
ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతరావు పదవీకాలం ముగిసి ఐదు నెలలు అయింది. కొత్త ప్రెసిడెంట్ నియమకానికి పార్టీ కూడా కసరత్తు చేస్తుంది. కొత్త చీఫ్ నియమించటానికి పార్టీ చేసిన కసరత్తు స్పీడ్ అప్ అయింది. అయితే దీనికి బ్రేకులు వేసే పనిలో ప్రస్తుత అధ్యక్షురాలు సునీతరావు ఉన్నారట. దేశంలోనే ఎక్కువ సభ్యత్వం చేశా పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేశా.. 80 కి పైగా తనపై కేసులు ఉన్నాయంటూ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వద్ద మొరపెట్టుకున్నారట సునీతరావు. కొత్త అధ్యక్షురాలు నియామకం చేపడితే మహిళా కాంగ్రెస్ కోసం తాను చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ఒత్తిడి పెంచుతుందట. ఇటు పార్టీ అటు ప్రభుత్వంలో ఉన్న పెద్దల ముందు డిమాండ్ పెట్టారట.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ నియోజకవర్గం నుంచి సునీతారావు పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో అనుబంధ సంఘం అధ్యక్షులు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వలేదు. కేవలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావుకి టికెట్ ఇచ్చింది పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనుబంధ సంఘాల చైర్మన్ లందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టింది. అయితే సునీత రావు పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో అనుబంధ సంఘాల చైర్మన్లను కార్పోరేషన్ పదవులు ఇచ్చిన నేపథ్యంలో తనకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన వారికి ఇప్పుడు వెంటనే కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సునీతరావు కొంత నారాజులో ఉన్నారట.
కొత్త అధ్యక్షురాలి నియమకంపై పార్టీ పెద్దలు కసరత్తు మొదలుపెట్టారు. దీంట్లో సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్న సునీతారావును మార్చాల్సి వస్తే, బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళని అధ్యక్షురాలు చేయాలనేది పార్టీ ఆలోచనగా కనబడుతుంది. ఎఐసిసి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళనే అధ్యక్షురాలుగా పెట్టాలని నిర్ణయం తీసుకుందట.
హై కమాండ్ మరో సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు పేరు కూడా పరిశీలిస్తోందట. అవసరం వస్తే.. ఓసీకి పదవి ఇవ్వాల్సి వస్తే.. అనే కోణంలో పార్టీ పెద్దలు అలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ బీసీ.. మరో ఓసీ నాయకురాలి పేర్లను పరిశీలిస్తోందట పార్టీ. బీసీ సామాజిక వర్గానికి చెందిన గద్వాల మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య తోపాటు, ఓసి సామాజిక వర్గానికి సంబంధించి బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే సరితా తిరుపతయ్యకు సీఎం రేవంత్ మద్దతు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సరిత తిరుపతతయ్యకే దాదాపుగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాయమైనట్టు ప్రచారం జరుగుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే సునీతరావుకు ఏదో ఒక పదవి కన్ఫర్మ్ అయ్యాకనే కొత్త మహిళా అధ్యక్షురాలి పదవి ఇవ్వాలనే ఒత్తిడి పెంచుతున్నారట. అయితే పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన వారికి తిరిగి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రస్తుత అధ్యక్షురాలు సునీతరావు ఏఐసిసి వరకు తనకేదో పదవి ఇచ్చేంతవరకు కొత్త చీఫ్ ని పెట్టొద్దంటూ ఒత్తిడి పెంచుతున్నారట. మొత్తం వ్యవహారంలో హై కమాండ్ ఏం చేస్తుంది. రాష్ట్ర నాయకత్వం ఎలాంటి పరిష్కారం చూపబోతుంది అనేది చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..