Hyderabad: పాతబస్తీలో హై అలర్ట్.. భారీగా బలగాల మోహరింపు.. ప్రదర్శనలు చేయొద్దంటూ అసదుద్దీన్ సూచన..
శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల కోసం ముస్లింలందరూ బయటకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో అలర్ట్‌గా ఉండాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Hyderabad police: రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, అరెస్ట్ నేపధ్యంలో పాతబస్తీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల కోసం ముస్లింలందరూ బయటకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో అలర్ట్‌గా ఉండాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఓల్డ్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మసీదుల వద్ద పోలీసులను మోహరించాలని సూచించారు. ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చార్మినార్, మక్కా మసీదు ఏరియాల్లో వేల మంది ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తమ నివాసాలకు దగ్గర్లో ఉన్న మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని అనవసరంగా బయటకు రావొద్దంటూ ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాజాసింగ్ అరెస్ట్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
రాజాసింగ్ అరెస్ట్‌పై.. అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై.. మూడు రోజులుగా చేసిన ఉద్యమం ఫలించిందన్నారు.. శాంతియుత ఉద్యమం వల్లనే.. తెలంగాణ సర్కార్ పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపిందని అసద్ వివరించారు. శుక్రవారం శాంతియుతంగా ప్రార్థనలు నిర్వహించుకోవాలి.. ధర్నాలు, నిరసనలు, వివాదస్పద నినాదాలు చేయొద్దంటూ అసదుద్దీన్ సూచించారు. గతంలో కొంతమంది బీజేపీ నేతలు పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామని రెచ్చగొట్టారని అసద్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు.
యువకుల మీద పోలీసుల ప్రవర్తనపై.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎంఐఎం విజ్ఞప్తి చేసినందుకే ఆందోళనకారులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అందరూ శాంతియుతంగా ప్రవర్తించాలి.. ధర్నాలు ప్రదర్శనలు చేయొద్దంటూ సూచించారు. ప్రత్యేక ప్రార్థనలు ప్రజలు తమ ఇండ్ల దగ్గర ఉన్న మసీదుల్లోనే నిర్వహించుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు.
– నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి