Operation Hydra: దూకుడు మీదున్న హైడ్రా.. నేలమట్టమైన ఎన్ కన్వెన్షన్.. మరి నెక్స్ట్ ఎవరు.?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా తగ్గేదేలే.. అంటోంది. దానిలో భాగంగా.. చెరువుల కబ్జాలు, నాలాల ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా ఏర్పాటే ఆలస్యం అన్నట్టుగా.. వరుసగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా తగ్గేదేలే.. అంటోంది. దానిలో భాగంగా.. చెరువుల కబ్జాలు, నాలాల ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా ఏర్పాటే ఆలస్యం అన్నట్టుగా.. వరుసగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేస్తోంది. బఫర్ జోన్‌లు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లను దింపుతోంది. అయితే.. తాజాగా.. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేయడంతో కబ్జారాయుళ్లకు మరింత వణుకుపుడుతోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో పలువురు ప్రముఖులు హడలిపోతున్నారు. దాంతో.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు?.. ఎక్కడ కూల్చివేతలు చేపట్టబోతోంది?.. అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఇక.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అనురాగ్ యూనివర్సిటీ స్థలం విషయంలో BRS సీనియర్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ యూనివర్శిటీ నిర్మాణాలు చేపట్టినట్లు ఇప్పటికే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గట్లే.. నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ కాలేజ్ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు.. పోలీసులు, హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఏకంగా.. పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయింది. దాంతో.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ వర్శిటీ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే.. హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ వేయగా.. చట్టప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేసింది హైకోర్టు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే యూనివర్శిటీ నిర్మాణాలు చేపట్టామని పల్లా తరపు లాయర్ వాదించగా.. ల్యాండ్ డాక్యుమెంట్స్, అనుమతుల పత్రాలు చెక్ చేసిన తర్వాతే రూల్స్ ప్రకారం వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు.
ఇదిలావుంటే.. హైడ్రా దూకుడుతో పలువురు ప్రముఖుల గుండెలు జల్లుమంటున్నాయి. ఎప్పుడు ఎవరి నిర్మాణాలపై హైడ్రా ఎటాక్ చేస్తుందోనని ఎవరికివారు గడగడలాడిపోతున్నారు. ఈ క్రమంలోనే.. పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు మల్లారెడ్డి కాలేజీలు, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి, కేటీఆర్, కేవీపీ ఫామ్‌హౌస్‌ల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. వీటీలో నెక్ట్స్ దేనిని హైడ్రా టార్గెట్ చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే.. ఆయ నేతలంతా.. తాము అన్ని పర్మిషన్లతోనే బిల్డింగ్‌లు, కాలేజీలు, ఫామ్‌హౌస్‌లు కట్టామని చెప్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదేసమయంలో.. తామంతా క్లీన్ అని మంత్రులు, నేతలు చెప్తుంటే.. ఆధారాలు బయటపెడుతూ షాకిస్తున్నారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్‌రావు. మొత్తంగా.. తెలంగాణలోని పలువురు కీలక నేతల్ని హైడ్రా హడలెత్తిస్తోంది. ఈనేపథ్యంలో.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత.. హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటదన్నది చూడాలి..




