Hyderabad: డ్రగ్స్ కొనేందుకు ఏకంగా కోటి విలువ చేసే ఆస్తులు అమ్మేసిన లేడీ డాక్టర్..!
మహిళా డాక్టర్ డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నారు పోలీసులు. అటు డ్రగ్స్ ముఠా తీగ లాగి మొత్తం గుట్టు కనుక్కునేందుకు నార్కోటిక్ టీమ్ రంగంలోకి దిగింది. కాగా మాదకద్రవ్యాలకు బానిసై, వాటిని కొనేందుకు ఈ మహిళా డాక్టర్ రూ. కోటి విలువైన ఆస్తులను విక్రయించినట్లు సమాచారం.

డ్రగ్స్‌తో పట్టుబడ్డ లేడీ డాక్టర్ చిగురుపాటి నమ్రత కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నమ్రతతో పాటు ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన టక్కర్ అనే పెడ్లర్ సహాయకుడు బాలకృష్ణను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో డొంక కదిల్చేపనిలో పడింది నార్కోటిక్ విభాగం.
ఈ కేసులో విచారణలో ఆమె కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన సమయం అక్కడ తనకు డ్రగ్స్ అలవాటయ్యాయని ఆమె పోలీసులకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశ్ టక్కర్ పరారీలో ఉన్నాడు. నమ్రత… స్నేహితురాలి బాయ్‌ఫ్రెండ్ స్వదీస్ సాయంతో కొకైన్ కొనుగోలు చేశారు. అతడి ద్వారానే ఆమెకు ముంబైకి చెందిన వంశ్ టక్కర్ నమ్రతకు పరిచయమయ్యాడు. టక్కర్ వద్ద డ్రగ్స్ సరఫరా చేసే కొరియర్‌గా పనిచేసే వాడినని బాలకృష్ణ పోలీసుల విచారణలో తెలిపాడు. అతడిని మరింత లోతుగా విచారిస్తే.. మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
వంశ్ టక్కర్ దొరికితే కేసులో మరింత పురోగతి
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశ్ టక్కర్‌ను దొరికితే.. మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ చేసే వారితో వంశ్ టక్కర్‌కు లింకులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత రూ. 70 లక్షలు విలువ చేసే డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కోసం డబ్బును చెల్లించేందుకు ఆమె ఏకంగా కోటి విలువైన ఆస్తులు అమ్మేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం, సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండటంతో.. ఈ కేసును పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
