TG Prajavani: ‘సారూ.. బతికేఉన్న! సచ్చిపోయినానని సర్కారోళ్లు అంటుండ్రు..పింఛన్ ఇస్తలేరయ్యా’ ఓ వృద్ధురాలి ఆవేదన
జీవితమంతా కష్టించి వయసుడిగి పోయిన పండుటాకులను ప్రభుత్వ అధికారులు నానాయాతన పెడుతున్నారు. బతికున్నోళ్లను రికార్డుల్లో చంపేసి.. పింఛన్‌కు ఎగనామం పెడుతున్నారు. తాజాగా ఓ వృద్ధురాలు తన ఆవేధన చెప్పుకుని కన్నీరుమున్నీరైంది. ‘నేను బతికే ఉన్న. పింఛన్ ఇవ్వండి సారూ’ అంటూ సదరు వృద్ధురాలు అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నా.. కనికరించ లేదు. ఈ క్రమంలో విసిగిన ఆ పండుటాకు సోమవారం కలెక్టరేట్‌లో..
హైదరాబాద్, జులై 16: జీవితమంతా కష్టించి వయసుడిగి పోయిన పండుటాకులను ప్రభుత్వ అధికారులు నానాయాతన పెడుతున్నారు. బతికున్నోళ్లను రికార్డుల్లో చంపేసి.. పింఛన్‌కు ఎగనామం పెడుతున్నారు. తాజాగా ఓ వృద్ధురాలు తన ఆవేధన చెప్పుకుని కన్నీరుమున్నీరైంది. ‘నేను బతికే ఉన్న. పింఛన్ ఇవ్వండి సారూ’ అంటూ సదరు వృద్ధురాలు అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నా.. కనికరించ లేదు. ఈ క్రమంలో విసిగిన ఆ పండుటాకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకుంది. వివరాల్లోకెళ్తే..
ఖైరతాబాద్ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే రుక్నమ్మ (59)కు భర్త చనిపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. పింఛన్ ఇప్పించమని తహసీల్దార్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడు లేడని కన్నీటి పర్యంతమైంది. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు చెప్పడంతో విస్తుపోయింది. కళ్లెదుట మనిషిని వచ్చి నిలబడితే.. నువ్వసలు బతికున్నావో.. లేవో.. అని అధికారులు అడుగుతున్నారయ్యా! అని వాపోయింది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా మంజూరైంది.
ఇప్పుడున్న సర్కార్ పింఛన్ ఇస్తలేరని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రజావాణిలో గతంలో పలుమార్లు దరఖాస్తులు ఇచ్చానని, ఎన్నిసార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇంకా మంజూరు కావడం లేదని తెలిపింది. తన సమస్యను ఏ అధికారి పరిష్కరించడం లేదని, కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. నాకు పింఛన్ ఇచ్చేందుకూ వీళ్లకు చేతులొస్తలేవని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, తప్పుల తడకగా వివరాలను నమోదు చేస్తుండటంతో ఇలా నిత్యం ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.