Telangana: ఒక్క యాడ్.. రూ.14కోట్ల లాభం.. విత్ డ్రా చేస్తుండగా బయటపడిన నిజం.. మహిళ షాక్..
మీరు సోషల్ మీడియాలో వచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలను నమ్ముతున్నారా..? అయితే ఇది మీకోసమే. ఒక్క యాడ్.. కొన్ని వాట్సాప్ చాట్లు.. కళ్లు చెదిరే లాభాల గ్రాఫ్‌లు.. వెరసి ఓ మహిళ ఏకంగా రూ. 2.3 కోట్లు పోగొట్టుకుంది. రూ.14 కోట్ల లాభం వచ్చిందని నమ్మించి, చివరికి చిల్లిగవ్వ కూడా చేతికి రాకుండా చేసిన ఈ భారీ ఆన్‌లైన్ మోసం వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

హైదరాబాద్‌లో మరో భారీ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసం వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియాలో కనిపించిన ఓ ఆకర్షణీయ ప్రకటనను నమ్మిన 45 ఏళ్ల మహిళ, క్రమంగా రూ.2.3 కోట్లను మోసగాళ్ల చేతికి అప్పగించి చివరకు లబోదిబోమంటోంది. స్టాక్ మార్కెట్ శిక్షణ పేరుతో మొదలైన ఈ మోసం.. నకిలీ లాభాల గ్రాఫ్‌లతో బాధితురాలిని పూర్తిగా నమ్మించేలా సాగింది. డిసెంబర్ 2025 చివరి వారంలో సోషల్‌మీడియాలో స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ట్రైనింగ్ అంటూ వచ్చిన ఓ యాడ్‌ను బాధితురాలు గమనించింది. రిజిస్ట్రేషన్ చేయగానే ఆమెను ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. అక్కడ ప్రొఫెసర్ అంటూ పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అనంతరం అన్లి అనే మహిళ, తాను కస్టమర్ సర్వీస్ మేనేజర్‌ని అంటూ బాధితురాలిని సంప్రదించింది.
భారతీయ, అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే విధానాన్ని వివరించడంతో పాటు ఓ ఆన్‌లైన్ లింక్ ద్వారా ట్రేడింగ్ యాప్ డౌన్‌లోడ్ చేయించి అకౌంట్ ఓపెన్ చేయించింది. అన్ని ట్రేడ్లు ఇన్‌స్టిట్యూషనల్ అకౌంట్ లేదా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ అకౌంట్ ద్వారా జరుగుతాయని.. దాంతో అప్‌పర్ సర్క్యూట్ స్టాక్స్, బ్లాక్ డీల్స్, ప్రిఫరెన్షియల్ ఐపీఓ కేటాయింపులు లభిస్తాయని మోసగాళ్లు ఆమెను నమ్మించారు. డిసెంబర్ 23న బాధితురాలు తొలిసారి రూ.50 వేల పెట్టుబడి పెట్టింది. కొద్దిసేపటికే చిన్న లాభం కనిపించడంతో ఆమె నమ్మకం మరింత పెరిగింది. అదే సమయంలో వాట్సాప్ గ్రూప్‌లో లాభాల స్క్రీన్‌షాట్లు షేర్ చేస్తూ.. ఇంకా పెద్ద అవకాశాలు ఉన్నాయి అంటూ మోసగాళ్లు ఎంకరేజ్ చేశారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 19 మధ్యకాలంలో బాధితురాలు ఏకంగా 11 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.2.3 కోట్లను బదిలీ చేసింది. ఆమె ఉపయోగిస్తున్న యాప్‌లో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నట్లు గ్రాఫ్‌లు, లాభాలు చూపిస్తూ మోసగాళ్లు మాయాజాలం సృష్టించారు.
యాప్ ఓపెన్ చేసిన ప్రతీసారి ఇన్వెస్ట్‌మెంట్ వ్యాల్యూ పెరుగుతూ కనిపించింది. మొత్తంగా రూ.14.77 కోట్ల లాభం వచ్చినట్లు గ్రాఫ్‌లు చూపించడంతో ఆమె పూర్తిగా నమ్మింది. కానీ ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయాలనుకున్నప్పుడే అసలు మోసం బయటపడింది. లాభాన్ని తీసుకోవాలంటే ముందుగా లాభంపై 15 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలంటూ మోసగాళ్లు కండీషన్ పెట్టారు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు ప్రశ్నలు వేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వాట్సాప్ గ్రూప్ పూర్తిగా మాయమైంది. ఫోన్ నంబర్లు స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు ఆమెకు స్పష్టమైంది. చేసేదేమీ లేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకు ఖాతాలు, డిజిటల్ ట్రయిల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ తరహా ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
