AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా? స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసి.. మరీ దాష్టీకం..!

ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా? తప్పు చేసింది పోగా, మళ్లీ ఎవరేం చేస్తారులే మనల్ని అనే అహంకారం పైగా. మామూలుగా ఈ కాలం యువత ఇలాగే ఉన్నారని అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసినప్పుడు. అమ్మాయి వెంటపడి వేధించడమే తప్పు అని తెలుసుకోకుండా, వారి కుటుంబసభ్యులపైకి ఎదురుదాడికి దిగారు.

Hyderabad: ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా? స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసి.. మరీ దాష్టీకం..!
Street Fight
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 01, 2024 | 1:17 PM

Share

ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా? తప్పు చేసింది పోగా, మళ్లీ ఎవరేం చేస్తారులే మనల్ని అనే అహంకారం పైగా. మామూలుగా ఈ కాలం యువత ఇలాగే ఉన్నారని అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసినప్పుడు. అమ్మాయి వెంటపడి వేధించడమే తప్పు అని తెలుసుకోకుండా, వారి కుటుంబసభ్యులపైకి ఎదురుదాడికి దిగడం, ఇదంతా జరుగుతున్నా పోలీసులు సరైన న్యాయం చేయకపోవడం ఇక్కడ మరింత విడ్డూరం. అలాంటి ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ మహానగరం మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయబస్తీకి చెందిన ఓ యువతిని గత కొంత కాలంగా విశాల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పదే పదే ఇదే జరుగుతుండడం, ఆకతాయి వేధింపులు భరించలేకపోవడంతో యువతి విషయాన్ని తన తండ్రికి తెలిపింది. కన్నకూతురి పట్ల ఇలా ప్రవర్తించిన వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆ తండ్రి యువకుడిని చితకదాబాడు. ఇది ఓర్చుకోలేని ఆ యువకుడి స్నేహితులు.. యువతి కుటుంబ సభ్యులపైకి ఎదురుదాడికి దిగారు. ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మాదన్నపేట్ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని, వాళ్ల అమ్మాయిని వేధించిన వాడికి పోలీసులు సరైన బుద్ధి చెప్తారని ఆ కుటుంబ సభ్యులు భావించారు.

కానీ, అంతటితో ఈ గొడవను సద్దుమణగనీయకుండా ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు. మరుసటి రోజు రాత్రి విశాల్ తన స్నేహితులతో కలిసి వాటర్ ట్యాంక్ వద్ద కరెంట్ ఫ్యూజ్ తీసివేసి స్ట్రీట్ లైట్స్ ఆఫ్ అయ్యేలా చేశారు. అనంతరం ఆ యువతి పెద్దనాన్నపై అకారణంగా దాడి చేశారు. ఆ క్రమంలో బాధితుడి మెడలో ఉన్న బంగారమంతా పోయింది. ఆ కుటుంబంలోని ఆడవాళ్లను కూడా చూడకుండా రక్తాలు వచ్చేలా చావబాదారు. నడిరోడ్డుపైనే నానా హంగామా సృష్టించారు. ఆ యువకులు కరెంటు ఫ్యూజ్ తీసిన కారణంగా మాదన్నపేట్ పోలీసు స్టేషన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంట్ పోయింది. స్థానిక ప్రజలు కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అల్లరిమూకలను అక్కడి నుంచి చెదరగొట్టారు. యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి పెద్దనాన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం జరిగేలా చూసి, ఇంతలా తమపై దాడి చేసి వేధించిన ఆ యువకులను తగిన విధంగా శిక్షించాలని వేడుకున్నారు. ఇంతవరకూ కరెంట్ ఫ్యూజ్ తీసి దాడి చేసిన ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…