Hyderabad: వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి.. అసలు ఏం జరిగిందంటే?
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణ బీభత్సం సృష్టించింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పాతబస్తీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడి.. ఇద్దరు యువకులు కరెంట్ షాక్‌కు గురయ్యారు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ సీ హోటల్ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడడంతో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న 25 ఏళ్ల జాఫర్, 16 ఏళ్ల అబూ ఆటోలో వచ్చి రాయల్ సీ హోటల్ వద్ద దిగారు. అయితే సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పక్క స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై మలిచిన నీటిలో పడిపోయాయి.
ఆటో దిగి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఇద్దరు యువకుల ఆ నీటిలో పడి ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. అలాగే ఆ నీటిలోంచి ముందుకు సాగారు. దీంతో నీటిలో కాలు పెట్టిన వెంటనే ఇద్దరు యువకులు తీవ్ర కరెంట్ షాక్‌కు గురయ్యారు. అది గమనించిన స్థానికులు వెంటనే కరెంట్ సరఫరాను నిలిపి వేసి యువకులను హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జాఫర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక తీవ్రంగా గాయపడిన అబూను అంబులెన్స్ సహాయంతో పక్కనే ఉన్న ఒవైసీ హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ అబూ కూడా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. ఇక సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించడంతో.. తెగిన విద్యుత్ తీగలను సకాలంలో తొలగించకుండా, విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలంలో తెగిన విద్యుత్ తీగల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు నిండిన ప్రాంతాల్లో నడవడం మానుకోవాలని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
