Hyderabad: జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి కౌంట్ డౌన్ స్టార్ట్..
గణేశ్ శోభయాత్ర అంటే ఇంటిల్లిపాదీ డెవోషనల్ పిక్నిక్‌లా భావిస్తారు. అందుకే కుటుంబ సమేతంగా ట్యాంక్‌బండ్ మీదకు చేరతారు. ఆరు నుంచి అరవై దాకా అన్ని వయసులవాళ్లూ తీన్మార్ డ్యాన్స్‌లు ఆడతారు. ఆ ఒక్కరోజులోనే ఏడాదంత జోష్ కనిపిస్తుంది. నిమజ్జనం అంతా సాఫీగా సాగేలా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

భాగ్యనగర గణేష్ శోభాయాత్ర.. ఇది ఏడు దశాబ్దాల చరిత్ర. సాగరమంత జనం మధ్య జరిగే మహా నిమజ్జనం. టన్నుల కొద్దీ జోష్.. అందుకే ఇది మస్త్ ఫేమస్. హైదరాబాద్ గణేషుడంటేనే వరల్డ్ ఫేమస్ గణేశుడు. బాలాపూర్ లడ్డూ వేలం ఎంతకు పోయిందన్న బ్రేకింగ్ న్యూస్ వింటేనే ఇక్కడ పండగ ముగిసినట్టు. ఖైరతాబాద్ గణేషుడి మహా నిమజ్జనం చూసి తరించాకే చవితి సంబరం ముగిసినట్టు. మొత్తంగా హైదరాబాద్ సంస్కృతిని, భక్తిని ఏకం చేసే శోభాయాత్ర విదేశీ పర్యాటకుల్ని కూడా ఎట్రాక్ట్ చేస్తుంది.
ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, తర్వాత హైటెక్ సిటీ, ఆ మధ్యలో ఫిలిమ్ సిటీ.. ఇవన్నీ మధ్యలో వచ్చేవే తప్ప జ్ఞాపకాల్లో స్థిరంగా ఉండేవి కాదు. కానీ.. వినాయక చవితి ఉత్సవాల్లో కీలక ఘట్టం.. భాగ్యనగర శోభాయాత్ర. ఇది మాత్రం ఆధునిక హైదరాబాద్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కుతుబ్ షాహీ నిజాం పాలన నాటి పురాతన దశ నుంచి మోడ్రన్ ఏరాలో సాఫ్ట్‌వేర్ హబ్‌గా ఎదిగి, ఎన్నెన్ని షేపులు మారినా.. భాగ్యనగరాన్ని ఒక్కటిగా చేసి చూపించే చెరిగిపోని జ్ఞాపకం మాత్రం ఇదొక్కటే.
నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
33 కిలోమీటర్ల మేర సాగే శోభాయాత్రలో 40 గంటల పాటు 50వేలకు పైగా గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిమజ్జనం కోసం నగరం మొత్తం 403 క్రేన్లు ఏర్పాటైతే, సాగర తీరం చుట్టూనే 30 వరకు క్రేన్లు ఉన్నాయి. నిమజ్జనాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. 600 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ట్యాంక్ బండ్‌కు దారితీస్తాయ్. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నీ జాగ్రత్తలు చేపట్టారు. 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. 13 కంట్రోల్ రూమ్‌లు, 160 యాక్షన్ టీమ్‌లు, 3200 మంది ట్రాఫిక్ పోలీసులు14,486 మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
బాలాపూర్ లడ్డూ వేలం
రికార్డులు బద్దలు కొట్టే లడ్డూ వేలం ధరలు శోభాయాత్రకు మరో ఎసెట్. ముఖ్యంగా బాలాపూర్ గణేష్ లడ్డూ 1980 నుంచి హాట్ ఫేవరిట్‌గా కంటిన్యూ ఔతోంది. 1994లో పదివేలు క్రాస్ చేసి… అక్కడినుంచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గత ఏడాది బాలాపూర్ లడ్డూ క్రియేట్ చేసిన రికార్డ్ 30 లక్షలా ఒక వెయ్యి. బాలాపూర్ లడ్డూ వేలం సెంటిమెంట్ భాగ్యనగరంలోని మిగతా మండపాలకు సైతం ఇన్‌స్పిరేషన్‌గా మారింది. అపార్ట్‌మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో సైతం గణేష్ లడ్డూలు వేలం పాటల్లో హాట్ కేకులుగా మారుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
