Padi Kaushik Reddy: కౌషిక్ రెడ్డిని ప్రోత్సహించేది ఎవరు.. వరుస వివాదాలతో హీరో అయ్యేనా, జీరోగా మిగిలేనా?
బీఅర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి వివాదాలకి మారుపేరుగా నిలుస్తున్నారు. దూకుడుగా వెళ్తూ పలుకేసులలో చిక్కుకుంటున్నాడు. ఆయనపై కేసులు హుజురాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడ నమోదు అవుతున్నాయి. కౌషిక్ రెడ్డిని ప్రోత్సహించేది ఎవరు? బీఅర్ఎస్ అధిష్టానమా? లేదా అతని స్వంత నిర్ణయమేనా?

Padi Kaushik Reddy: బీఅర్ఎస్‌లో కొంతమంది నేతలు దూకుడుగా వెళ్తుంటే.. మరికొంత మంది సైలెంట్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో హుజురాబాద్‌లోనే దూకుడు ప్రదర్శించేవాడు. ఇప్పుడు ఎక్కడ సమావేశం జరిగిన అతడే లీడ్ తీసుకుంటున్నాడు. అది మండల పరిషత్ సమావేశం అయినా, అసెంబ్లీ సమావేశం అయినా రచ్చరచ్చ చేస్తున్నాడు. అయితే బీఅర్ఎస్ అధిష్టానమే కౌషిక్ రెడ్డిని ప్రోత్సహిస్తుందా.. లేదంటే తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడా అని తెలియాల్సి ఉంది.
మొన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో సంజయ్ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించడంతో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈ దూకుడుని అధిష్టానం ప్రోత్సహిస్తున్న కొంతమంది బీఅర్ఎస్ నేతలకి నచ్చడం లేదనే ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో బీఅర్ఎస్ విజయం సాధిస్తే కౌషిక్ రెడ్డి కీలక మంత్రిపదవి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఏ చిన్నపాటి సంఘటన జరిగిన వెంటనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులని కలిసి వస్తున్నాడు.
దీనిని బట్టి చూస్తే అధిష్టానం అండదండలు ఉన్నట్లు అర్థం అవుతుంది. అంతేకాకుండా ఈసమయంలో తన ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు కౌషిక్ రెడ్డి. అయితే సీనియర్ నేతలు మాత్రం ఇతని దూకుడును పూర్తిగా సమర్థించలేకపోతున్నారు. ముఖ్యంగా రేవంత్ సర్కారుపై విమర్శల దాడితో చెలరేగిపోతున్నాడు.
ఫిరాయింపుల అంశాన్ని కూడ తరుచుగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారో వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాడు. మొన్న జరిగిన సంఘటనపై రెండుమూడు రోజులు చర్చ సాగింది. నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాలి అంటూ పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ ముఖ్యనేతలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.
అయితే, కౌషిక్ రెడ్డి మాత్రం అటూ పార్టీ పెద్దల అండతో పాటు తన ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ కూడ ఇది కౌషిక్ రెడ్డి చేస్తున్న నాటకం కాదని, బీఅర్ఎస్ పెద్దలు కేసీఆర్, హరిష్ రావు, కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. తరుచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న కౌషిక్ రెడ్డి హీరో అవుతాడా.. లేదంటే సెల్ప్ గోల్ అవుతాడా.. అనేది కాలమే నిర్ణయిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
