AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SLBC: నాలుగు దశాబ్దాల కల.. SLBC ప్రాజెక్టు పొడవెంత..? ఎవరికి లాభం?

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల తాగు, సాగు నీటి అవసరాలకు కోసం నిర్మిస్తున్న SLBC టన్నెల్‌‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కేంద్ర, రాష్ట్ర సహయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్‌ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. నరకానికి నకలు లాంటి ఆ ప్రాంతంలో ఎనిమిదిమంది చిక్కుకుపోయారు.

SLBC: నాలుగు దశాబ్దాల కల.. SLBC ప్రాజెక్టు పొడవెంత..? ఎవరికి లాభం?
Telangana SLBC Tunnel Rescue Operation
Balaraju Goud
|

Updated on: Feb 23, 2025 | 7:49 PM

Share

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) ప్రాజెక్టు. ఆరు నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు.. 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు.. నాలుగు దశాబ్దాల కాలంగా ముందుకు సాగడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. దీంతో సుమారు ఐదేళ్ల తర్వాత టన్నెల్‌ పనులు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది..

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించాని నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం దేశంలోనే అతి పెద్దది. ఈ టన్నెల్‌ నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మొదలై.. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర పూర్తవుతుంది.

శ్రీశైలం నీటిమట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా.. నాలుగువేల క్యూసెక్కుల సామర్థ్యంతో 43.93 కిలో మీటర్ల దూరం టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌తో సొరంగం తవ్వుతున్నారు. దీనిద్వారా వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నింపాలి. శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్‌లైట్‌ సొరంగం 13.97 కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది. నీళ్లు బయటకు వచ్చే ఔట్‌లెట్‌ వైపు నుంచి 20.4 కి.మీ. దూరం తవ్వారు. మొత్తమ్మీద మరో 9.6 కి.మీ. మేర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా సొరంగం 14వ కిలోమీటర్‌ దగ్గర ప్రమాదం జరిగింది.

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లో భాగంగా డిండి రిజర్వాయర్‌ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు.. 7.130 కిలోమీటర్ల మేర మరో సొరంగం కూడా చేపట్టారు. ఈ రెండో సొరంగమార్గం ఇప్పటికే తవ్వకం పూర్తయ్యింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది. టీబీఎంతో చేపట్టిన ఈ ప్రధాన సొరంగం పనులే పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే ఇవి పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదం.. ప్రాజెక్ట్‌ను మరింత ఆలస్యం చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..