Telangana: ప్రభుత్వ హాస్టల్‌లో దారుణం.. కనకవర్షం కురుస్తుందనీ విద్యార్థినితో నగ్న పూజకు యత్నం! తర్వాత జరిగిందిదే..
ప్రభుత్వ హాస్టల్ లో చదువుకుంటున్న బాలికల సంరక్షణ ప్రశ్నార్ధంగా మారిందనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. హాస్టల్ లోని బాలికకు మాయమాటలు చెప్పి నగ్న పూజలు చేసేందుకు అదే హాస్టల్ లోని వంట మనిషి యత్నించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది..
పెద్దపల్లి, నవంబర్ 26: మూడనమ్మకాల ముసుగులో బాలికల హాస్టల్ వసతి గృహంలో దారుణానికి ఒడిగట్టారు. కనక వర్షం కరుస్తుందని, డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుందని ఏకంగా విద్యార్ధినితో నగ్న పూజలకు ఒడిగట్టారు. హాస్టల్‌లో వంట పని చేసే వంట మనిషి ఈ దారుణానికి పాల్పడటం ఇంకా విడ్డూరం. ఈ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పొరుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని, తన సోదరితో కలిసి ఉంటుంది. బాలిక తల్లిదండ్రులు పేదవారు కావడంతో ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ అక్కచెల్లెల్లు చదువుకుంటున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్‌లో పనిచేసే ఓ వంట మనిషి దారుణానికి ఒడిగట్టింది. ఆ ఇద్దరు బాలికలను చేరదీసినట్టుగా నటిస్తూ పెద్ద కుట్రకు తెరదించింది. వారిలో పెద్దమ్మాయికి మాయ మాటలు చెప్పి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని నమ్మించింది. ఆ డబ్బుతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండవచ్చని నమ్మబలికింది. వంట మనిషి మాయ మాటలు నమ్మిన బాలిక ఆమె చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో వారం క్రితం వంట మనిషి ఉండే గదికి ఓ వ్యక్తిని తీసుకువచ్చింది. అక్కడకి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉండాలని చెప్పింది. అప్పుడు అతడు ప్రత్యేక పూజలు చేస్తాడని, అప్పుడు డబ్బు బంగారం రాశులు కురుస్తాయని చెప్పింది.
దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆ విద్యార్థిని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి 4 రోజులుగా అక్కడే తలదాచుకుంది. అనంతరం అసలు విషయం బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది. బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ వద్దకు చేరుకుని సదరు వంట మనిషిని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ రాజు, ఎస్‌ఐ రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సర్దుమనిగేలా చర్యలు చేపట్టారు. బాలికను ప్రలోభ పెట్టిన మహిళను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్టు మంథని ఎస్‌ఐ తెలిపారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.