నవంబర్ 9న రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్.. ఇదిగో BRS షెడ్యూల్
తెలంగాణ అసెంబ్లీలోని మొత్తం 119 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ నవంబర్ 3న మొదలై నవంబర్ 10న ముగుస్తుంది. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. ఈ క్రమంలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన BRS తమ కార్యచరణ షెడ్యూల్ కూడా తాజాగా అనౌన్స్ చేసింది.

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీఫారాలను అధినేత కేసీఆర్ అందచేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు కేసీఆర్ వివరిస్తారు. సూచనలు ఇస్తారు. కాగా.. అదే సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం అదేరోజు (అక్టోబర్ 15) న హైద్రాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు :
అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ నామినేషన్లు :
నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
సెంట్రల్ తెలంగాణ అన్ని పార్టీలకు కీలకం
రాష్ట్ర రాజధానితో పాటు కీలక నియోజకవర్గాలున్న సెంట్రల్ తెలంగాణ అన్ని పార్టీలకీ అత్యంత కీలకంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్ పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించబోతున్నాయి. ఆంధ్రప్రాంత ఓటర్లతో పాటు సామాజికసమీకరణాలు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో ఎంఐఎంకి పట్టుంటే.. మిగిలినచోట్ల ఆ పార్టీ బీఆర్‌ఎస్‌కి మద్దతిస్తోంది. బీజేపీ కూడా హైదరాబాద్ జిల్లాపై గట్టి నమ్మకంతో ఉంది. రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్‌కి కొంత నాయకత్వ సమస్య ఉన్నా.. మైనంపల్లిలాంటి ముఖ్యనేత చేరికతో ఎన్నికల సమయానికి సెంట్రల్ తెలంగాణలో కూడా తమకు తిరుగు ఉండదనుకుంటోంది ఆ పార్టీ. రాష్ట్రంలో మూడోవంతు నియోజకవర్గాలు ఇక్కడే ఉండటంతో ఇక్కడి గెలుపోటములే అన్ని పార్టీలకు కీలకం. అర్బన్ ఓటర్లు టార్గెట్‌గా అన్ని పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..