Telangana News: భూమి నుంచి ఒక్కసారిగా ఉబికి బయటకు వచ్చిన నీటి సంపు.. షాక్ అయిన గ్రామస్తులు..
Telangana News: సాధారణంగా బాటా నీటితో తడిచిపోయిన భూమి కుంగిపోవడం జరుగుతుంది. అలాంటి ఘటనలు కోకొల్లుగా చూసుంటాం.
Telangana News: సాధారణంగా బాటా నీటితో తడిచిపోయిన భూమి కుంగిపోవడం జరుగుతుంది. అలాంటి ఘటనలు కోకొల్లుగా చూసుంటాం. కానీ, భూమి ఉబికి బయటకు రావడం ఎప్పుడైనా చూశారా? ఏకంగా నీటి సంపు పైకి లేవడం చూశారా? అయితే, ఇప్పుడు భూమి పైకి ఉబికి బయటకు వచ్చిన సంపు గురించి తెలుసుకోవాల్సిందే. అప్పటి వరకు మామూలుగా ఉన్న నీటి సంపు.. ఒక్కసారిగా భూమి నుంచి ఉబికి బయటకు వచ్చింది. అది చూసి జనాలు షాక్ అయ్యారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా చండూరు మండలం తేరట్ పల్లి గ్రామంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తేరట్ పల్లి గ్రామానికి చెందిన బరిగెల నరేష్ ఇంటి ఆవరణలో నీటి సంపు ఉంది. ఇంటి నీటి అవసరాల కోసం ఐదేళ్ల క్రితం ఎనిమిది సిమెంట్ గూనలతో నీటి సంపును ఏర్పాటు చేసుకున్నారు.
ఇవాళ ఉన్నట్లుండి నాలుగు గూనల మేర నీటి సంపు పైకి ఉబికి వచ్చింది. అది చూసి నరేష్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. స్థానికులు సైతం దానిని చూసి షాక్ అయ్యారు. అయితే, ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగు పోయడంతో.. భూమి బాగా తడిచి ఉప్పొంగిందని, దాని కారణంగానే గూనలు పైకి లేచి ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. నీటి సంపు పైకి రావడానికి గల కారణాలను వివరించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పుడు నేల స్వభావం బట్టి భూగర్భ జలాల స్థాయి పెరిగి భూమి వ్యాకోచించడం, లేదా ఇతర కారణాలతో భూమి మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఇలా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఏదేమైనా ఈ వింతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.
Also read:
Rakul Preet Singh: ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం.. కొండపొలం నాకు పెద్ద సవాలు.. ఓబులమ్మ ముచ్చట్లు..