Harish Rao: వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై హరీశ్ రావు ఫైర్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి బావమరిది బాగోతాన్ని బయటపెట్టిన కొద్ది గంటల్లోనే సిట్ నోటీసులు రావడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవలు, ప్రభుత్వ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనపై ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ఎదుట హరీష్ రావు విచారణకు హాజరవుతున్నారు. విచారణకు వెళ్లే ముందు రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే.. కక్షగట్టి సాయంత్రానికే తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకే విచారణకు రావాలనడం వెనుక ప్రభుత్వ తొందరపాటు, వేధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు.
డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి..
ప్రస్తుత ప్రభుత్వం తీవ్రమైన కుంభకోణాల్లో కూరుకుపోయిందని హరీష్ రావు విమర్శించారు. కేబినెట్ మంత్రులు వాటాల పంపకాల్లో గొడవపడుతున్నారని, అది బయటపడకుండా ఉండేందుకే తనపై కేసుల డ్రామా ఆడుతున్నారని అన్నారు. భూములు, బొగ్గు, పవర్ స్కామ్‌ల వల్ల ప్రభుత్వం పరువు పోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు.. విచారణకు భయపడే ప్రసక్తే లేదు. న్యాయవ్యవస్థపై గౌరవంతో విచారణకు హాజరవుతున్నాను. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే నన్ను వేధిస్తున్నారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపను’’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటుందని, ఇలాంటి ‘డ్రామాలు’ ఎన్ని రోజులు నడుపుతారో చూస్తామని ఆయన సవాల్ విసిరారు.
విచారణలో కీలక అంశాలు
జాయింట్ సీపీ విజయ్‌కుమార్, డీసీపీ రితిరాజ్, ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని ఆరుగురు అధికారుల బృందం హరీష్ రావును ప్రశ్నించనుంది. 2023 సర్వేలు, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికారుల వద్ద ఉన్న డేటా ఆధారంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. విచారణకు వెళ్లే ముందు హరీష్ రావు తన లాయర్లతోను, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనూ సుదీర్ఘంగా చర్చించారు.
