Raja Singh: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా.. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం..
గోషామహాల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు.. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక.. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో ఆయన నియోజకవర్గం హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తోంది. దీంతో ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో గోషామహాల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
గోషామహాల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానాకి సిద్ధంగా ఉన్నానని ఆయన కీలక ప్రకటన చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు నుంచి ఒత్తిడి వస్తోందని, సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని పేర్కొన్నారు. ఉపఎన్నిక వస్తే కేసీఆర్‌కు బడుగులు, రైతులపై ప్రేమ కలుగుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తే తప్ప నిధులు కేటాయించడం లేదని విరుచుకుపడ్డారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా, గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే వెంటనే ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెరపైకి వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే ఒత్తిడులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, ఇది కాస్త బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా పాకింది. దీంతో తానూ రాజీనామాకు రెడీగా ఉన్నట్లు రాజాసింగ్ ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్య కొనసాగుతోంది.