Godavari Floods: వరద ముప్పు తగ్గుతోందా ?.. భద్రాచలం వద్ద 69.4 అడుగులకు నీటిమట్టం.. అయినప్పటికీ

మహోగ్రరూపం దాల్చిన గోదావరి (Godavari) క్రమంగా శాంతిస్తోంది. భద్రాచలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన నీటిమట్టం...

Godavari Floods: వరద ముప్పు తగ్గుతోందా ?.. భద్రాచలం వద్ద 69.4 అడుగులకు నీటిమట్టం.. అయినప్పటికీ
Bhadrachalam Floods
Follow us

|

Updated on: Jul 16, 2022 | 7:15 PM

మహోగ్రరూపం దాల్చిన గోదావరి (Godavari) క్రమంగా శాంతిస్తోంది. భద్రాచలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన నీటిమట్టం ఈరోజు (శనివారం) సాయంత్రానికి 69.4 అడుగుల వద్ద నమోదైంది. నదిలో 23.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. అయినప్పటికీ అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కాగా.. గోదావరి వరదల నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. వందల గ్రామాల్లో కరెంటు స్తంభాలు నేలకూలాయి. రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రజా, రవాణా, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది.

భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కరకట్టకు పలుచోట్ల స్లూయీస్‌లకు లీక్‌లు తలెత్తాయి. ఈ ప్రభావం అయ్యప్పకాలనీపై తీవ్రంగా పడింది. సుభాష్‌నగర్‌ కాలనీ చుట్టూ కట్ట ఉన్నప్పటికీ ముంపు తప్పలేదు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. కరకట్టపైకి ఎవరినీ అనుమతించవద్దని చెప్పారు. మరోవైపు.. భద్రాచలం వరద పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్పందించారు. భద్రాచలం వద్ద వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 20.60 అడుగులుగా ఉంది. ఇంకా ప్రవాహం పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. వరద యధవిధిగా కొనసాగితే, 44 మండలాల్లోని 628 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 10 ఎన్డీఆర్‌ఎఫ్‌, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కీలక శాఖల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..