Ghar Wapasi: తెలంగాణలో రాజకీయ ఘర్ వాపసీ.. ఎవరి ధీమాలో వారు.. అధినేతల తీరే వేరు..!

తెలంగాణ రాజకీయాల్లో ఘర్ వాపసీ అనే పదం తాజాగా ఊపందుకుంది. మూడు ప్రధాన పార్టీలు ఘర్ వాపసీపై ఫోకస్ చేశాయి. అయితే.. గత ఏడేళ్ళలో పెద్ద ఎత్తున ఆకర్ష్ ద్వారా బలం పెంచుకున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి...

Ghar Wapasi: తెలంగాణలో రాజకీయ ఘర్ వాపసీ.. ఎవరి ధీమాలో వారు.. అధినేతల తీరే వేరు..!
Kcr, Ktr,bandi Sanjay And Revanth Reddy
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajesh Sharma

Updated on: Jul 14, 2021 | 1:35 PM

Ghar Wapasi in Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఘర్ వాపసీ అనే పదం తాజాగా ఊపందుకుంది. మూడు ప్రధాన పార్టీలు ఘర్ వాపసీపై ఫోకస్ చేశాయి. అయితే.. గత ఏడేళ్ళలో పెద్ద ఎత్తున ఆకర్ష్ ద్వారా బలం పెంచుకున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ నుంచే పెద్ద ఎత్తున వలసలుంటాయని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తుండగా.. అధికార పార్టీ నేతలు మాత్రం తమ పార్టీని ఎవరూ వీడరంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్త కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. గతంలో పార్టీని వీడిన నేతలను తిరిగి రప్పించే పనికి శ్రీకారం చుట్టారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదని వాదిస్తున్న బీజేపీ.. తమ పార్టీలోకి కాస్తో.. కూస్తో పేరున్న నేతలను చేర్చుకునే ప్రయత్నాలను వేగవంతం చేసింది. దుబ్బాకలో సత్తాచాటినట్లుగానే హుజురాబాద్‌ ఉప ఎన్నికలోను విజయం సాధిస్తామని కమలనాథులు ధీమాగా వున్నారు. హుజురాబాద్ విజయం తమ పార్టీలోకి మరింత మంది పేరున్న నేతలను తీసుకొస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.

పార్టీలో చిరకాలం నుంచి కొనసాగుతున్న నేతలను కాదని మరీ టీపీసీసీ అధ్యక్ష పదవిని సాధించుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి.. పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపేలా ప్రణాళికను అమలు చేస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే పలువురు సీనియర్లను మచ్చిక చేసుకున్న రేవంత్ రెడ్డి.. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వున్న కాంగ్రెస్ శ్రేణులను పోరుబాటలోకి దింపారు. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పెట్రో ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కొత్త అధ్యక్షుని పిలుపందుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. చివరికి సీనియర్ నేతలు సైతం రోడ్డెక్కారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ.. తమదైన శైలిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి పిలుపు పార్టీలో కొత్త ఉత్సాహం నింపిందనడానికి పెట్రో ధరలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలువురు సీనియర్ నేతలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.

ఓవైపు పార్టీని పోరుబాటలో నడిపిస్తూనే.. మరోవైపు గతంలో పార్టీకి దూరమైన నేతలను వెనక్కి రప్పించే పని ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా జులై 13న ఆయన గతంలో పార్టీకి రాజీనామా చేసిన.. చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని కలిశారు. పార్టీలోకి తిరిగి రావాలని ఆహ్వానించారు. దానికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో పార్టీకి దూరమైన నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, ఒకప్పుడు తనకు టీడీపీలో సహచరుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్, భూపాలపల్లికి చెందిన గండ్ర సత్యనారాయణ రావులను పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. వీరితో జరిపిన సమాలోచనలు విజయవంతమవడంతో ఆపరేషన్ ఆకర్ష్.. ఆపరేషన్ వికర్ష్.. లను ఓకేసారి కొనసాగించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వేరే పార్టీలో వున్న వారిని తమ పార్టీలోకి రప్పించడం ఆపరేషన్ ఆకర్ష్ అయితే.. గతంలో చిరకాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి.. పలు కారణాలతో టీఆర్ఎస్, బీజేపీలలో చేరిన వారిని తిరిగి తమ పార్టీలోకి వచ్చేలా చేసుకోవడం ఆపరేషన్ వికర్ష్.. ఇలా రెండు వ్యూహాలను ఒకేసారి అమలు పరచడం ద్వారా తన సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకున్నదని చాటేలా రేవంత్ రెడ్డి వ్యూహాన్ని అమలు పరుస్తున్నారు.

ఇక బీజేపీ సైతం ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసే సంకేతాలను ఇస్తోంది. ఆగస్టు 9వ తేదీ నుంచి తెలంగాణలో తొలి విడత పాదయాత్ర నిర్వహించేందుకు సిద్దమవుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. అదే క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్‌ని కొనసాగించాలని భావిస్తున్నారు. పాదయాత్ర సన్నాహక సమావేశంగా జులై 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన భేటీలో బండి సంజయ్ పార్టీలో బలోపేతంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. తన పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీస్తుందని ఆయన ధీమాగా వున్నట్లు తెలుస్తోంది. నిజానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను సాగనంపే దిశగా అడుగులు పడుతున్న సమయంలో ఆయన్ను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారు. చివరికి కారణాలేవైతేనేం ఈటల బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపారు. అదే ఊపులో బీజేపీ నేతలు మరికొందరు టీఆర్ఎస్ నేతలకు గాలమేసేందుకు విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆ యత్నాలు ఫలించకపోవడంతో.. పాదయాత్ర ద్వారా పొలిటికల్ పోలరైజేషన్‌కు బీజేపీ నాయకత్వం సిద్దమైంది.

ఇక, రెండు విపక్ష పార్టీలు టీఆర్ఎస్ పార్టీకి తామంటే తామే ప్రత్నామ్నాయం అని చాటుకునే ప్రయత్నాల్లో వుండగా.. గులాబీ పార్టీ మాత్రం ఇప్పటికిప్పుడు తమ పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళబోరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగే లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మాటలకే తప్ప చేతలకు పనికి రారని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 2019లో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కొందరు నేతలు ఆ పార్టీలో చేరినా.. ఆ తర్వాత చేరికలు నిలిచిపోవడమే తమ ధీమాకు ప్రాతిపదిక అని గులాబీ నేతలంటున్నారు. నిజానికి 2014 నుంచి వరసగా వచ్చి చేరుతున్న ఇతర పార్టీ నేతలతో కారు ఓవర్ లోడ్ అయ్యింది. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యీ సీటు కోసం ముగ్గురు, నలుగురేసి నేతలు పోటీ పడే పరిస్థితి వుంది. ఈలోగా రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, శాసన సభ సీట్ల సంఖ్య 153కి పెరుగుతుందని గులాబీ నేతలు భావించారు. కానీ ఈ ఆశలకు కేంద్రంలోని బీజేపీ మోకాలడ్డింది. 2026 దాకా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వుండబోదని పలుమార్లు పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రులు ప్రకటించారు. అయితే, తాజాగా ఈ ఆశలు మరోసారి చిగురించాయి. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కేంద్రం.. అక్కడ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సిద్దమవుతోంది. ఈక్రమంలో 2014 ఏపీ విభజన చట్టంలో ప్రస్తావించినట్లుగానే తెలంగాణ, ఏపీలలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అగత్యం కేంద్రానికి వుంది. ఈక్రమంలో వచ్చే ఎన్నికలకు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

నియోజకవర్గాల సంఖ్య పెరిగే పరిస్థితి వుంటే.. ఓవర్ లోడ్ అయిన కారు పార్టీ లోంచి ఇతర పార్టీల్లోకి వలసలు వుండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోపు నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే.. టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ దక్కే అవకాశం లేని నేతలు కాంగ్రెస్, బీజేపీల వైపు తప్పక చూస్తారని వారు అంఛనా వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఇటీవల టీడీపీ తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్ రమణ చేరారు. నేడో, రేపో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ వేటును ఎదుర్కోబోతున్న కౌశిక్ రెడ్డి సైతం కారెక్కేందుకు సిద్దమవుతున్నారు. ఆయన హుజురాబాద్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా.. మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రాధాన్యతనిస్తుండడంతో తెలంగాణ రాజకీయాలు చురుకుగా మారాయి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో