Viral: పొలం పనుల కోసం వెళ్తే పలకరించిన జల పుష్పాలు.. సంచుల్లో నింపుకుని ఇళ్లకు వెళ్లిన జనాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో చెపలు రోడ్లపైకి, పొలాల్లోకి కొట్టుకు వస్తున్నాయి. స్థానికులు వాటిని పట్టుకుని ఇళ్లకు తీసుకువెళ్తున్నారు.
Telangana: నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్లగొండ, ఖమ్మం(Khammam), మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్(Warangal) జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు వంకలు ఉప్పొంగాయి. పలు చోట్ల కాలవలకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. రహదారులపైకి నీళ్లు చేరాయి. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా కోదాడ(Kodad)లో కురిసిన భారీ వర్షానికి.. పంట పొలాల్లోకి చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో రైతులు వల లేకుండానే సులువుగా చేపలు పట్టుకుంటున్నారు. ఒక్కో చేప రెండు నుంచి మూడు కిలోల వరకూ ఉన్నాయి. కొర్రమీను, రవ్వ, బొచ్చె, బురద మట్ట చేపలు పొలాల్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం పొలం పనులు పక్కన పెట్టి చేపలు పట్టే పనిలో బిజీబిజీ అయ్యారు రైతులు. బస్తాల నిండా చేపల నింపుకుని ఇళ్లకు వెళ్తున్నారు. ముసురులో మాంచి చేపల పులుసు తింటే ఆ కిక్కే వేరు అంటున్నారు.
ఇలాగే మరో రెండు రోజులపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని, మరో 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి .. 24 గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భైంసా, ముధోల్, కుభీర్, కుంటాల,లోకేశ్వరం, తానురు మండలాలలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు నిండు కుండల మారింది. అటు నిజామాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండూరులో అత్యధికంగా 18 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. చెరువులు ,వాగులు పొంగిపొర్లుతున్నాయి… రహదారులు కొట్టుకుపోయాయి. రాకపోకలకు అంతరాయం కలగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వీ.ఎం.బంజర్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..