Karimnagar: మాటలకందని విషాదం..కాసేపట్లో కూతురు పెళ్లి.. అంతలోనే గుండెపోటుతో కుప్పకూలిన తండ్రి..
Karimnagar: సెప్టెంబర్ 3 ఆదివారం ఉదయం పది గంటలకు వివాహ మూహూర్తం. సమీపంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి గుట్టపై పెళ్లి జరగాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఊహించని విషాదం జరిగింది. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా.. రాములు ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపట్టుకుని కుప్పకూలిపోయాడు. ఛాతిలో నొప్పిగా ఉందంటూ కిందపడిపోయాడు..
కరీంనగర్, సెప్టెంబర్ 04: ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే.. ఆ సందడి, హడావుడి మామూలుగా ఉండదు. చుట్టాలు, బంధువులతో ఇళ్లంతా కలకలలాడుతూ ఉంటుంది. అందరూ కలిసి పెళ్లి పనులు చకచకా జరిపించేస్తుంటారు. ఇంటికి రంగులు వేసింది మొదలు.. పెళ్లి,రిసెప్షన్ వరకు హంగామా అంతా ఇంతా కాదు..ఇక కూతురి పెళ్లంటే.. ఆ తల్లిదండ్రులకు కంటిమీద కునుకే ఉండదు. ఘనంగా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాతే ఆ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఊపిరిపీల్చుకోగలుగుతారు. కానీ, కాసేపట్లో కూతురి పెళ్లి అనగా.. ఓ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే ప్రాణాలు విడిచాడు. దీంతో.. ఆ పెళ్లింట మాటలకందని విషాదం నిండిపోయింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాద సంఘటన.పూర్తి వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామానికి చెందిన ఎర్రల రాములు ట్రాక్టర్ మెకానిక్. రాములు – మంజుల దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా, పెద్ద కూతరు లావణ్య వివాహం నిశ్చయమైంది. సెప్టెంబర్ 3 ఆదివారం ఉదయం పది గంటలకు వివాహ మూహూర్తం. సమీపంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి గుట్టపై పెళ్లి జరగాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఊహించని విషాదం జరిగింది. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా.. రాములు ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపట్టుకుని కుప్పకూలిపోయాడు. ఛాతిలో నొప్పిగా ఉందంటూ కిందపడిపోయాడు.. రాములును గమనించిన బంధువులు హూటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాములును పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించాడని నిర్ధారించారు. రాములు మరణంతో భార్యాబిడ్డలు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
ఎలాంటి లోటు లేకుండా.. బిడ్డ పెళ్లి చేయాలనీ తండ్రి భావించాడు రాములు.. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్ళికి ఎలాంటి లోటు లేకుండా నిర్వహించడానికి దగ్గర ఉండి చూసుకున్నారు. అన్ని పనులు.. తానే చూసుకున్నారు.. బరువు నుంచి బయట పడుతున్నానని బంధువులకు చెప్పారు.. అందరిని పిలిచారు.. మంచి భోజనం కూడా ఏర్పాటు చేశారు.. కానీ.. కూతురు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లారు వధువు తండ్రి. దీంతో.. పెళ్లిని వాయిదా వేశారు.. కూతురు కన్నీరు.. మున్నీరుగా విలపిస్తున్నారు.. ఎవరు ఓదార్చిన.. కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..