AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడా కరుణించు.. వర్షాలు కురవాలని శివుడికి జల దిగ్బంధం.. వీడియో చూశారా..?

ఎల్‌నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శివాలయంలో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగం చుట్టూ నీటిని నింపి జలదిగ్బంధం చేస్తూ సకాలంలో వర్షాలు కురవాలని పరమేశ్వరుడిని వేడుకున్నారు. గ్రామ వీధుల్లో సంప్రదాయ ‘కప్పతల్లి ఆట’ నిర్వహిస్తూ వరుణ దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు రైతులు, గ్రామస్థులు కలిసి ప్రార్థనలు చేశారు.

దేవుడా కరుణించు.. వర్షాలు కురవాలని శివుడికి జల దిగ్బంధం.. వీడియో చూశారా..?
Rain Prayers
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 22, 2026 | 6:08 PM

Share

ఎల్‌ నీనో ఎఫెక్ట్‌తో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.. నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ.. వర్షాల జాడ కనిపించడం లేదు.. ఇప్పటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు వర్షాల కోసం దిగాలుగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతులు సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శివాలయంలో పరమేశ్వరుడికి జలదిగ్బంధం చేసి, వర్షాలు కురవాలని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు గ్రామ ప్రజలతో కలిసి శివలింగం చుట్టూ నీటిని నింపి జలదిగ్బంధం చేయడంతో పాటు శివుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని వేడుకున్నారు.

గ్రామంలోని వీధుల గుండా ఇంటింటికి తిరుగుతూ రైతులు సంప్రదాయ కప్పతల్లి ఆట నిర్వహించారు. వరుణ దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని పాటిస్తూ, గ్రామ ప్రజలందరూ వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ఇప్పటికే వర్షాలు ఆలస్యమవుతుండటంతో వ్యవసాయ పనులపై ప్రభావితమవుతున్నాయని, మంచి వర్షాలు కురిసి రైతాంగానికి ఊరటనివ్వాలని ఆకాంక్షించారు. వర్షాల కోసం రైతులు నిర్వహించిన జలదిగ్బంధం, కప్పతల్లి ఆట గ్రామంలో భక్తి, సంప్రదాయం, రైతాంగ ఆవేదనకు ప్రతీకగా నిలిచింది.

వీడియో చూడండి..

కాగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే.. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us