Telangana: బైక్‌పై బ్యాగ్‌తో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. పోలీసులు వెళ్లి చెక్ చేయగా
సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు అయింది. ఆరుగుర్ని అరెస్ట్ చేయగా.. ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

తెలంగాణలో నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సూర్యాపేట జిల్లాలో భారీ నకిలీ పత్తి విత్తనాల దందా బయటపడింది. దీనికి సంబంధించి సూర్యాపేట ఎస్పీ నరసింహ కీలక విషయాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో 65 లక్షల విలువైన 2,200 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు పీఎస్ పరిధిలోని పాతర్లపాడులో సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన నగేష్ అనే వ్యక్తి అనుమానాస్పంగా కనిపించాడు. దాంతో.. తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాల బాగోతం బట్టబయలు అయింది.
బైక్‌పై ఉన్న 120 ప్యాకెట్లు నకిలీ విత్తనాల గోనెసంచి పట్టుబడింది. అతన్ని విచారించడంతో డొంక కదిలింది. నకిలీ పత్తి విత్తనాల కేసులో ఆరుగురు సభ్యుల చైన్ లింకును గుర్తించారు. సూర్యాపేటలో పట్టుబడ్డ నరేష్.. ఎన్టీఆర్ జిల్లా పెనుగొలను, మైలవరం గ్రామాలను పంది రాములు, బానోతు జయరాం ద్వారా కొనుగోలు జరిగినట్లు వెల్లడైంది. జయరామ్‌కి మైలవరంలో విత్తనాల దుకాణం ఉండగా.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు సరఫరా చేసినట్లు గుర్తించారు. దాంతో.. జయరాం షాపులో సోదాలు చేసి.. 37 బస్తాల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఆయా నిందితులు ఇచ్చిన సమాచారంతో సూర్యాపేట జిల్లా రావిపాడులోని వెలుగు శ్రీను అనే వ్యక్తి ఇంట్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దాంతో.. అడ్వాన్స్ 333, అరుణోదయ అనే కంపెనీల పేర్లతో ఉన్న 98 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసి విచారించడంతో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తితో కలిసి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు తేలింది. గడ్డి మందును తట్టుకుని.. అధిక దిగుబడిన ఇచ్చే మంచి రకం పత్తి విత్తనాలు అని రైతులను నమ్మించి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని చేసినట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.