AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంట్లో బంగారం ఉందంటూ తవ్వకాలు.. కట్ చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే

బక్రా దొరికితే చాలు బలి ఇచ్చేస్తాం.. ఇదీ కొందరు నకిలీ బాబాల ఆలోచన.. ఆ ఆలోచనతోనే అక్కడ ఓ అమాయక కుటుంబం.. ఇబ్బందులను, ఆపదను ఆసరా చేసుకున్నారు. ఆ ఇంట్లోవాళ్ల ఆరోగ్యాలు బాగుపడాలన్నా.. వారు బతికి బట్టకట్టాలన్నా.. కొన్ని పూజలు చేయాల్సి ఉంటుందని కొందరు దొంగస్వాములు జట్టుకట్టి నమ్మబలికారు.

Telangana: ఇంట్లో బంగారం ఉందంటూ తవ్వకాలు.. కట్ చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే
Black Magic
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 18, 2025 | 4:02 PM

Share

బక్రా దొరికితే చాలు బలి ఇచ్చేస్తాం.. ఇదీ కొందరు నకిలీ బాబాల ఆలోచన.. ఆ ఆలోచనతోనే అక్కడ ఓ అమాయక కుటుంబం.. ఇబ్బందులను, ఆపదను ఆసరా చేసుకున్నారు. ఆ ఇంట్లోవాళ్ల ఆరోగ్యాలు బాగుపడాలన్నా.. వారు బతికి బట్టకట్టాలన్నా.. కొన్ని పూజలు చేయాల్సి ఉంటుందని కొందరు దొంగస్వాములు జట్టుకట్టి నమ్మబలికారు. వారి నుంచి ఏకంగా 13 లక్షల 30 వేల రూపాయలు వసూలు చేశారు.. చివరకు ఫిర్యాదు అందడంతో.. ఆ దొంగబాబాలను కరీంనగర్ పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఇంతకీ ఆ క్షుద్రపూజలేంటి..? గుప్తనిధుల తవ్వకాల కథేంటి..? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

స్వామి వేషంలో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా 15 రోజుల క్రితం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన గజ్జి ప్రవీణ్‌కు ఓ మంత్రగాడు పరిచయమయ్యాడు. ప్రవీణ్ తండ్రి కనకయ్య ఆర్టీసీలో పనిచేస్తూ ఎడమకాలు విరగడంతో బాధపడుతుండగా.. తల్లి కూడా అనారోగ్యం పాలైంది. దీంతో ఆవిషయాన్ని ఆ దొంగబాబాకు చెప్పాడు ప్రవీణ్.. ఇంకేం దొరికిందిగా గొర్రె అనుకున్నాడు ఈర్నాల రాజు అనే దొంగబాబా.. ప్రవీణ్ ఇంటికెళ్లాడు. అక్కడి ఇంట్లో ఏమీ బాగాలేదని.. పక్కనే గుప్తనిధుల కోసం తవ్వితే ఓ బంగారుకడ్డీ ఉన్న పెట్టె బయటపడుతుందని నమ్మబలికాడు. అది బయటకు తీస్తేనేకానీ.. ప్రవీణ్ తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుందని మాయమాటలు చెప్పాడు. లేకపోతే, నెలరోజుల్లో ప్రవీణ్ తండ్రి చనిపోతాడని భయపెట్టాడు. అందుకు కొంత పూజా సామాగ్రి కావాలన్నాడు. ముందు 3 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మరోసారి 5 లక్షలు, ఆ తర్వాత మరో ఐదు లక్షలు.. ఇలా మొత్తం 13 లక్షల 30 వేల రూపాయలు ప్రవీణ్ కుటుంబం వసూలు చేశాడు దొంగబాబా.. ఇలా తనతో పాటు మరో నలుగురు కేటుగాళ్లను వేసుకుని వచ్చి.. వాళ్ల నమ్మకాన్ని ఆసరా చేసుకుని.. భయపెడుతూ వసూళ్లు మొదలుపెట్టి ఇంటిపక్కనే గొయ్యి తవ్వి క్షుద్రపూజలు మొదలుపెట్టాడు.

వీడియో చూడండి..

ఇంటిపక్కనే మంత్రగాళ్లు పెద్దగొయ్యి తవ్వి కుంకుమ, నిమ్మకాయలు, పసుపు వంటివాటితో పూజ చేసి.. వారివెంటే తెచ్చిన ఓ డబ్బాను ఆ ఇంటివాళ్లెవ్వరూ చూడకుండా గొయ్యిలో పాతిపెట్టి అందులో బంగారు కడ్డీ ఉంటుందని నమ్మించారు. దాన్ని తెరవకూడదని భయపెట్టారు. ఆ డబ్బాను దేవుడి గదిలో పెట్టమని ఆదేశించారు. దాంతోపాటే ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే అదే గొయ్యిలో మీ నాన్నను పాతిపెడతామని భయపెట్టారు. అలా అప్పటికే 13 లక్షల 30 వేల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డ ఆ ఐదుగురు మంత్రగాళ్ల ముఠాపై పవీణ్ కు అనుమానం వచ్చింది.. దీంతో ప్రవీణ్ కరీంనగర్ రూరల్ పోలీసులను సంప్రదించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 లక్షల 30 వేల రూపాయలు, 7 తులాల బంగారం, మూడు కార్లు, 7 సెల్ ఫోన్స్ స్వాధీనపర్చుకున్నారు.

నిందితులంతా నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ చేశారు. నకిలీ స్వాములు, బాబాలు, మంత్రగాళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలాంటి బాబాలపాలిట పడ్డవారు ఎవరైనా ఉన్నా, అనుమానాలు తలెత్తినా తమను సంప్రదించాలనీ పోలీసులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. మొత్తంగా కరీంనగర్ వంటి పట్టణ సమీపంలో.. శాస్త్రవిజ్ఞానం ఇంతగా అబివృద్ధి చెందుతున్న రోజుల్లో ఇలాంటి మూఢనమ్మకాలతో గుప్తనిధులు, క్షుద్రపూజలు, నరబలులవైపు జనం అడుగులేయడం దురదృష్టకరమని.. ఇలాంటివి అంతా అబద్ధమని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..