Electricity Bills: ఇకపై తెలంగాణలో విద్యుత్ బిల్లులు చెల్లింపు కౌంటర్లు మధ్యాహ్నం 12 గంటల వరకూ పనిచేస్తాయి..
Electricity Bills: తెలంగాణా విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం కోసం కరెంట్ బిల్లు వసూలు కేంద్రాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచిఉంచనున్నారు.
Electricity Bills: తెలంగాణా విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం కోసం కరెంట్ బిల్లు వసూలు కేంద్రాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచిఉంచనున్నారు. ఈమేరకు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిఎస్ఎస్పిడిసిఎల్) సంబంధిత అధికారులను కోరింది. వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి అలాగే బిల్లు వసూలును మెరుగుపర్చడానికి అన్ని బిల్ కలెక్షన్ కౌంటర్లను ఎక్కువ సమయం తెరచి ఉంచాలని టిఎస్ఎస్పిడిసిఎల్ చెప్పింది. ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 10 గంటల వరకూ బిల్లు వసూలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. దానికి బదులుగా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచాలని టిఎస్ఎస్పిడిసిఎల్ కోరింది. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్స్ (ఇరో) కలెక్షన్ కౌంటర్లు కూడా ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండాలని చెప్పింది.
లాక్డౌన్ సమయంలో కలెక్షన్ కౌంటర్లను ఆపరేట్ చేయడానికి పోలీసుల నుండి అవసరమైన అనుమతి తీసుకోవాలని టిఎస్ఎస్పిడిసిఎల్ ఆదేశించింది. అలాగే, కలెక్షన్ కౌంటర్లను నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీ వ్యక్తులకు అవసరమైన గుర్తింపు కార్డులు, అనుమతి లేఖలను అందించాలని టిఎస్ఎస్పిడిసిఎల్ అధికారులను ఆదేశించినట్లు చీఫ్ జనరల్ మేనేజర్ (రెవెన్యూ) తెలిపారు. లాక్డౌన్ వ్యవధిలో వినియోగదారులు తమ నెలవారీ విద్యుత్ బిల్లులను చెల్లించడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టు ఈమెయిల్స్ మరియు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసిన తరువాత ఈ సూచనలు ఇచ్చారు. ఉదయం 10 తర్వాత కౌంటర్లు మూసివేయడంతో వినియోగదారులు ఆఫ్‌లైన్‌లో బిల్లులు చెల్లించడంలో ఇబ్బందులు వ్యక్తం చేశారు. విద్యుత్తు అత్యవసర సేవా రంగం కావడంతో, మహమ్మారి సమయంలో ఉద్యోగులు తమ విధులను ప్రాణాలకు తెగించి నిర్వర్తిస్తున్నారు. వైద్య, ఆరోగ్య, మరియు పోలీసు విభాగాల ఉద్యోగులతో పాటు పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్‌లైన్ కార్మికులుగా పరిగణించడం ద్వారా ప్రాధాన్యతతో టీకాలు వేయించారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులను కూడా గుర్తించాలని వారు కోరుతున్నారు. “కోవిడ్ -19 కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులతో పాటు విద్యుత్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు చాలా ముఖ్యమైనవారన్నది వాస్తవం” అని టిఎస్‌పిజెఎసి తెలిపింది.