Telangana joins Ayushman Bharat: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని నిర్ణయం.. కేంద్రంతో ఒప్పందం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

Telangana joins Ayushman Bharat: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ( ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ) పథకంలో చేరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కెసీఆర్ ఆదేశించారు. ఈమేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ ఎ రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవో కు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ఖరారు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు సీఈవోకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మెమో జారీ చేశారు.
ఆయుష్మాన్ భారత్ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో రాంచీలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. అయితే, అంతకు ముందు ఆగస్టులోనే హర్యానాలోని కర్నాల్‌లో జన్మించిన కరిష్మా అనే బాలికను ఈ పథకం మొదటి లబ్ధిదారుగా ఎంపిక చేశారు.
కాగా, ఈ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించనున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించనున్నారు.

Telangana Joins Ayushman Bharat