Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priest Theft Mangalsutra: పెళ్లైన కాసేపటికే వధువు మెడలో మంగళసూత్రం మాయం.. అసలు విషయం తెలిసి అతిథుల షాక్..!

వివాహం అంటే మంగళసూత్రంతో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యే శుభకార్యం. అలాంటి పెళ్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగిన కాసేపటికే వధువు మెడలో తాళి బొట్టు మాయమైంది.

Priest Theft Mangalsutra: పెళ్లైన కాసేపటికే వధువు మెడలో మంగళసూత్రం మాయం.. అసలు విషయం తెలిసి అతిథుల షాక్..!
Priest Theft Mangalsutra From Bride After Marriage Rituals
Follow us
Balaraju Goud

|

Updated on: May 18, 2021 | 10:26 PM

Priest Theft Bride Mangalsutra:  వివాహం అంటే మంగళసూత్రంతో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యే శుభకార్యం. అలాంటి పెళ్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగిన కాసేపటికే వధువు మెడలో తాళి బొట్టు మాయమైంది. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తర్వాత.. భోజనాలు ముగిసి చూసుకునేసరికి వధువు మెడలో ఉండాల్సిన మంగళసూత్రం కనిపించకుండాపోయింది. దీంతో అందరూ కంగారుపడిపోయారు. ఇప్పుడే వరుడు కట్టాడుగా.. అప్పుడే ఎక్కడికి పోయిందని వెతికడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా కనిపించలేదు.

చివరకు పెళ్లి వీడియో చూసేసరికి దొంగ దొరికిపోయాడు. ఆ వీడియో చూసి వధూవరుతో పాటు బంధువులంతా షాక్ తిన్నారు. మంగళసూత్రాన్ని కొట్టేసింది ఎవరో కాదు.. సాక్షాత్తు మంత్రాలు చదివిన తాళిబొట్టు కట్టించిన పండిత మహానుభావుడు పురోహితుడే. ఈ దురదృష్ట ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెదక్ జిల్లా తుప్రాన్‌కు చెందిన పడాలపల్లికి చెందిన జ్ఞానేందర్ దాస్, నర్సాపురం మండలం గొల్లపల్లికి చెందిన వసంత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నెల 16న తుప్రాన్‌లో పెళ్లి వేడుక జరిగింది. గజ్వేల్‌కు చెందిన ఓ పురోహితుడు వీరి పెళ్లి తంతును నిర్వహించారు. అయితే, వధువు మెడలో వరుడు కట్టిన తాళి కాసేపటికే కనిపించలేదు. అప్పటికే పెళ్లి తంతు పూర్తయింది. ఆ బంగారం మంగళసూత్రం 3 తులాల వరకు ఉంటుంది. ఎక్కడైనా పడిపోయిందా? లేదంటే ఎవరైనా కొట్టేశారో అర్ధం కాలేదు. వధువు-వరులతో పాటు పెళ్లికి హాజరైన బంధు మిత్రులందరూ వెతకడం మొదలుపెట్టారు. అయినా ఎక్కడా కనిపించలేదు.

అయితే, వివాహ తంతును రికార్డు చేసిన వీడియోను పరిశీలించడంతో అసలు బండారం బయటపడింది. పెళ్లి జరిపించిన పంతులే తాళి బొట్టును కొట్టేసినట్లు తేలింది. మంగళసూత్రాన్ని తన జేబులో వేసుకుంటున్నట్లుగా అందులో స్పష్టంగా రికార్డయింది. దీంతో ఆ దొంగ పురోహితుడి కోసం వధూ వరుల బంధువులు రెండు రోజులుగా వెతకడం మొదలుపెట్టారు. అయితే, ఈ వ్యవహారం తెలిసిన సదరు పూజారి ఫోన్ స్విచాఫ్ చెక్కేశాడు. దీంతో అతని ఇంటికెళ్లి అడిగితే తనకేమీ తెలియదని ఆయన భార్య సమాధానమిచ్చింది.

ఇక, గత్యంతరం లేక వధూ వరులు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. సదరు పురోహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పురోహితుడు తాళి బొట్టును జేబులో వేసుకుంటున్న వీడియోను పరిశీలించారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also… Plaint Against CM Vijayan: ముఖ్యమంత్రిపై కోవిడ్ ఉల్లంఘన కేసు.. ఫిర్యాదు చేసిన కేంద్ర మాజీ మంత్రి థామస్