Telangana: తెలంగాణ వాసులకు బంపర్ ఆఫర్.. లోగో డిజైన్ చేస్తే.. రూ.1 లక్ష బహుమతి
రాష్ట్రప్రజలకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్‌ఐజీ ప్రాజెక్టు పేరు పెట్టి కాంటెస్ట్ పెట్టిన ప్రభుత్వం తాజాగా మరో కాంటెస్ట్‌తో ముందుకొచ్చింది. ఈసారి ఈ ఎల్‌ఐడీ పథకానికి కావాల్సిన విధంగా లోగో డిజైన్ చేసిన వారికి రూ.లక్ష బహుమతి అందజేయనున్నట్టు ప్రకటించింది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం పదండి.

తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎల్‌ఐజీ (లో ఇన్‌కమ్ గ్రూప్) గృహ నిర్మాణ పథకానికి అధికారిక లోగోను ప్రజల నుంచే ఎంపిక చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో సోషల్ మీడియా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా లోగో డిజైన్ పోటీని ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఇదే గృహ నిర్మాణ పథకానికి పేరు సూచించేందుకు నిర్వహించిన పోటీకి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. సుమారు 14 వేల పేర్లు అందగా, ప్రస్తుతం వాటి పరిశీలన కొనసాగుతోంది. ఎంపికైన పేరును త్వరలో ప్రకటించడంతో పాటు, విజేతకు పథకం ప్రారంభోత్సవం రోజున బహుమతి అందజేయనున్నారు.
లక్ష ఇళ్ల పథకానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకంగా లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తోంది. అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఫ్లాట్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ప్రజలకు ఇళ్లు అందేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు.
లోగోలో ప్రతిబింబించాల్సిన అంశాలు
ఈ గృహ నిర్మాణ పథకం లక్ష్యం, సామాజిక బాధ్యత, ఆధునికత, అభివృద్ధి భావనను ప్రతిబింబించేలా లోగో ఉండాలని హౌసింగ్ బోర్డు సూచించింది. సరళంగా ఉండేలా, ఒకే చూపులో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాన్ని గుర్తించేలా డిజైన్ రూపొందించాలని కోరింది.
రూ.1 లక్ష నగదు బహుమతి
ఉత్తమ లోగోను రూపొందించిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నారు. ఈ లోగోను భవిష్యత్తులో ప్రభుత్వ అధికారిక పత్రాలు, ప్రచార సామగ్రి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, హౌసింగ్ బోర్డు కార్యక్రమాల్లో అధికారిక గుర్తుగా వినియోగించనున్నారు.
ఎవరు పాల్గొనవచ్చు?
ఈ పోటీలో గ్రాఫిక్ డిజైనర్లు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు, కళాకారులు, సృజనాత్మక రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పాల్గొనవచ్చు. కొత్త ఆలోచనలతో రూపొందించిన ప్రతి డిజైన్‌ను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
జూలై 12 వరకు అవకాశం
పోటీలో పాల్గొనాలనుకునే వారు తెలంగాణ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని గూగుల్ ఫారమ్ ద్వారా తమ లోగోను జూలై 12లోపు సమర్పించాలి. ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, డిజైన్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే పోటీలో పాల్గొన్నట్లే.
ప్రజల ఆలోచనలకు ప్రభుత్వం ప్రాధాన్యం
ప్రభుత్వ పథకానికి పేరు మాత్రమే కాకుండా అధికారిక లోగోను కూడా ప్రజల నుంచే ఎంపిక చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. లక్ష రూపాయల బహుమతితో పాటు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గృహ నిర్మాణ పథకానికి శాశ్వత గుర్తింపునిచ్చే అవకాశం ఈ పోటీ ద్వారా లభించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
