Telangana: తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. పనులు షురూ..
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్త రైల్వే లైన్ నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం భూసేకరణ పనులు పూర్తవ్వగా.. త్వరలో డబులింగ్ పనులు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే కేంద్రం నిధులు కేటాయించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. డొర్నకల్ జంక్షన్-భద్రాచలం రోడ్ మధ్య డబుల్ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ రైల్వే లైన్ మాత్రమే ఉండగా.. డబుల్ లైన్ నిర్మించనున్నారు. సింగిల్ లైన్ మాత్రమే ఉండటం వల్ల రైల్వే రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో డబుల్ లైన్ వేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉండగా.. ఇప్పుడు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కూడా ముగియగా.. త్వరలో డబులింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ లైన్ పూర్తయితే భద్రాచలం రామాలయానికి సులువుగా చేరుకోవచ్చు. డొర్నకల్‌లో దిగి భక్తులు సులభంగా భద్రాచలం వెళ్లవచ్చు.
పూర్తయిన భూసేకరణ ప్రక్రియ
భూసేకరణ ప్రక్రియ కోసం గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం ఇప్పుడు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో త్వరలో పనులు మొదలుపెట్టనున్నారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్ వరకు ఈ కొత్త రైల్వే లైన్ ఉండనుండగా.. పోచారం, కారేపల్లి, గాంధీపురం హాల్ట్, చీమలపహాడ్, తడికలపూడి, బేతంపూడి రైల్వే స్టేషన్లు మధ్యలో ఉంటాయి. ఆరు రైల్వే స్టేషన్ల గుండా ఇది ఈ రైల్వే లైన్ వెళుతుంది. డోర్నకల్-మణుగూరు మధ్య మొత్తం 104 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని 2008-09 బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా తొలి విడతలో డోర్నకల్-భద్రాచలం రోడ్ మధ్య నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.770 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
అదనంగా రైల్వే కార్యాలయాలు
ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 32.03 ఎకరాల భూమి అవసరం అవుతుందని గుర్తించగా.. 355 రైతుల నుంచి అవసరమైన భూమిని సేకరించారు. ఇక అదనంగా మరో ఏడున్నర ఎకరాల భూమిని కూడా సేకరించారు. ఈ లైన్ పూర్తయితే భద్రాచలం ఆలయానికి వెళ్లేవారికి మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక డోర్నకల్ మీదుగా నడిచే రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక స్థానిక ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్దికి కూడా ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం డోర్నకల్‌లో రైల్వే యార్డును రీ మోడల్ చేయడంతో పాటు అదనపు రైల్వే కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక రైళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కోచ్ ఫిట్ లైన్ నిర్మిస్తున్నారు.
