Dengue Fever: వర్షాలకు ముందే తెలంగాణలో ప్రబలుతోన్న డెంగ్యూ జ్వరాలు.. వ్యాధి లక్షణాలు, జాగ్రత్తల గురించి తెలుసుకోండి..
ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 200 కేసులు నమోదుకాగా.. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి. డెంగ్యూ కేసుల ప్రాధమిక దశ మొదలుకావడం హైదరాబాద్ నగరవాసులు వణికిస్తోంది. వర్షాల కారణంగా మరో మూడు మాసాలకు డెంగ్యూ కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు.

Telangana News: నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ముందే డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. హైదరాబాద్ మహా నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 200 కేసులు నమోదుకాగా.. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి. డెంగ్యూ కేసుల ప్రాధమిక దశ మొదలుకావడం హైదరాబాద్ నగరవాసులు వణికిస్తోంది. వర్షాల కారణంగా మరో మూడు మాసాలకు డెంగ్యూ కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు.
గత ఏడాది (2022) తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8,756 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా అదే సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదుకావచ్చని వైద్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న డెంగ్యూ కేసుల్లో చాలా వరకు తేలికపాటి తీవ్రత కలిగినవిగా అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రిలో కొన్ని కేసులు నిర్ధారణకాగా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. వర్షాలు మొదలుకావడంతో ముందు ముందు డెంగ్యూ కేసుల సంఖ్య హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగే అవకాశముందని అంచనావేస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో డెంగ్యూ రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాద్‌తో పాటు భద్రాచలం, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ వ్యాధితో వారు స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇది డెంగ్యూ ప్రారంభ దశ మాత్రమేనని.. జూలైలో కేసులు పెరుగుతాయని వైద్య నిపుణులు, అధికారులు అంచనావేస్తున్నారు.
దాదాపు 5% డెంగ్యూ రోగుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ దోమలు 200 మీటర్ల పరిధిలో ఉండి వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. తమ కుటుంబీకులు, స్థానికులు ఎవరికైనా డెంగ్యూ సోకితే.. ప్రజలు తప్పనిసరిగా మున్సిపల్ కార్పొరేషన్‌ను సంప్రదించి డెంగ్యూ కేసులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన మందులతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అవసరమైన ఇతర లాజిస్టిక్స్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సమకూర్చుతున్నట్లు అధికారులు తెలిపారు. డెంగ్యూ కేసుల పట్ల ఆందోళన అవసరం లేదని, దీని కట్టడికి అవసరమైన పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Dengue
హైదరాబాద్‌లో ప్లేట్లెట్స్ కొరత..
డెంగ్యూ కేసులు పెరుగుతుండగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్లేట్లెట్ల కొరత నెలకొంటున్నట్లు తెలుస్తోంది. ప్లేట్లెట్ల కోసం నగరంలో బ్లడ్ బ్యాంక్‌లను సంప్రదించేవారి సంఖ్య గత కొన్ని రోజులుగా గణనీయంగా పెరిగింది. ముందు ముందు ప్లేట్లెట్ల కోసం డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. జులై నుంచి సెప్టెంబర్ మధ్య డెంగ్యూ కేసులు పెరిగే అవకాశముందని, ఆ సమయంలో సింగిల్ డోనర్ ప్లేట్లెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నారు.
డెంగ్యూ వ్యాధి లక్షణాలు..
- తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కండరాలు, కీళ్ల నొప్పులు, కంటి లోపలి భాగంలో నొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం వంటి లక్షణాలు ఉంటే డెంగ్యూ కావొచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవాలి.
- ఒంటిపై ఎర్రటి మచ్చలు రావడం, ఆయాసం, కళ్లు తిరగడం, రక్తపోటు తగ్గడం, ముక్కు, పంటి చిగుర్లు, ఇతర అవయవాల నుంచి రక్తస్రావం ఏర్పడితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పరిగణించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి
డెంగ్యూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- డెంగ్యూ కేసులు ప్రబలుతుండటంతో ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ దోమ గుడ్లు పెట్టేందుకు వీలు లేకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో వృధా నీరు నిల్వకాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. నీరు నిల్వ ఉంచిన తొట్లు, ఇతర పాత్రలను మూసి ఉంచడంతో పాటు.. కుళాయి దగ్గర, ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
- వీలైనంత మేరకు శరీరారాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. షాట్స్ వేసుకుంటే డెంగ్యూ దోమలు కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- నీటి తొట్లను ఇతర పాత్రలను వారానికి ఒకసారి శుభ్రంగా కడిగి, తుడిచి మరలా నీరు నింపుకోవాలి.
- దోమ తెరలను తప్పనిసరిగా వాడాలి. దోమలు రాకుండా ఇంటి లోపల, బయట చెత్తా చెదారం ఉంచకుండా చూసుకోవాలి.
- ఉదయం, సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. దోమలు చేరకుంటా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించుకోవాలి.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..




