AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దావోస్‌లో తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. రూ.7 వేల కోట్లకు పైగా ప్రాజెక్టుల ప్రతిపాదనలు- భారీ ఉద్యోగాలు

Telangana: తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం అభినందించారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పాటు, తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు..

Telangana: దావోస్‌లో తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. రూ.7 వేల కోట్లకు పైగా ప్రాజెక్టుల ప్రతిపాదనలు- భారీ ఉద్యోగాలు
Davos Wef 2026
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 21, 2026 | 6:53 PM

Share

Telangana: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)–2026 సమావేశాల్లో తెలంగాణ మరోసారి గ్లోబల్ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. క్లీన్ ఎనర్జీ, విమానయాన రంగాల్లో రూ.7 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు దావోస్ వేదికగా రాష్ట్రానికి లభించాయి. స్లోవాకియా, అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. క్లీన్ ఎనర్జీ రంగంలో కీలక అడుగుగా, స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ తెలంగాణలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (SMR) ఆధారిత విద్యుత్ ప్లాంట్ అభివృద్ధికి ఈఓఐ సమర్పించింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని సంస్థ ప్రతిపాదించింది. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ తెలంగాణ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు మైలురాయిగా మారనుంది.

దావోస్‌లో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ప్రతినిధులు ప్రాజెక్ట్ రూపురేఖలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 2047 నాటికి నెట్–జీరో లక్ష్యాన్ని సాధించడమే రాష్ట్ర దీర్ఘకాలిక దృష్టికోణమని ఆయన తెలిపారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ యూరోలు కాగా, భారత కరెన్సీలో ఇది సుమారు రూ.6,000 కోట్లకు సమానం.

ఇదే సమయంలో, విమానయాన రంగంలో మరో భారీ పెట్టుబడికి అమెరికాకు చెందిన సర్గాడ్ (Sargad) సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణలో విమానాల మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO) కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.1,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.

దావోస్‌లో సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో ఏరోస్పేస్ రంగానికి అనువైన వాతావరణం ఉందని, ఎంఆర్వో కేంద్రానికి రాష్ట్రం ఉత్తమ గమ్యస్థానమని సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను మూడు ప్రత్యేక అభివృద్ధి జోన్లుగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. సేవల రంగానికి CURE, తయారీ రంగానికి PURE, వ్యవసాయం–గ్రీన్ ఎకానమీకి RARE జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయాల సమీపంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు చేయాలని సర్గాడ్ సీఈఓకు సూచించారు.

వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడులతో స్థానిక ఎంఎస్‌ఎంఈలకు పరికరాల తయారీ, సప్లై చైన్ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. దావోస్ వేదికగా వచ్చిన ఈ రెండు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు తెలంగాణను క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో దేశంలోనే కీలక హబ్‌గా మార్చే దిశగా మరో బలమైన అడుగుగా నిలవనున్నాయి.

దావోస్ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడి

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)–2026 సదస్సులో తెలంగాణకు మరో కీలక పెట్టుబడి లభించింది. డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన రష్మి గ్రూప్, రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వంతో రూ.12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం సమక్షంలో ఈ ఎంవోయూ జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రాష్ట్రంలో సుమారు 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. తయారీ రంగంలో తెలంగాణను మరింత బలోపేతం చేసే దిశగా ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం అభినందించారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పాటు, తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక వసతులు, బొగ్గు సరఫరా లింకేజీలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి తెలంగాణ రైజింగ్ బృందంతో భేటీ అయ్యారు. ఈ ప్లాంట్ లేబర్–ఇంటెన్సివ్ విధానంతో పనిచేస్తుందని, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వారు తెలిపారు. అదేవిధంగా గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో దీర్ఘకాలిక భాగస్వామ్యంపై కూడా చర్చలు జరిగాయి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర–దక్షిణ అమెరికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రష్మి గ్రూప్ పెట్టుబడితో తెలంగాణ పారిశ్రామిక పటంలో మరో కీలక అధ్యాయం చేరనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి