Telangana: ఓటీపీ చెప్పాలంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. కట్ చేస్తే.. క్షణాల్లో.!
ఉద్యోగాలు, రుణాలు, ఆఫర్లు, క్రిప్టో కరెన్సీ ద్వారా అధిక లాభాలు పొందవచ్చని మరికొందరు.. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలని..
ఆన్‌లైన్‌లో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. కేటుగాళ్లు క్రియేటివిటీని ఉపయోగించి మరీ అమాయకులను బురిడీ కొట్టించడమే కాదు.. దర్యాప్తు సంస్థల బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియోలు, పోస్టులకు లైకులు కొట్టడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని కొందరు మోసాలకు పాల్పడుతుండగా.. ఉద్యోగాలు, రుణాలు, ఆఫర్లు, క్రిప్టో కరెన్సీ ద్వారా అధిక లాభాలు పొందవచ్చని మరికొందరు.. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలని, ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిందని, క్రెడిట్ కార్డ్ మంజూరైందంటూ ఇంకొందరు ప్రజలను సులభంగా మోసం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు సైబర్ నేరస్థుల బారినపడి రూ. 1,06,120 పోగొట్టుకున్నారు అమాయకులు.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు గడువు ముగుస్తోందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. ఓటీపీ చెప్పగానే రూ. 8900 మాయం చేశారు. అలాగే కొమురవెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పాన్ కార్డు పేరుతో ఫోన్ వచ్చింది. ఓటీపీ చెప్పడంతో రూ. 92,220 కోల్పోయాడు. అటు హుస్నాబాద్‌లో ఓ వ్యక్తి తక్కువ పెట్టుబడితో బిజినెస్ పేరుతో ఓ కాల్ రాగానే.. దాన్ని నమ్మడంతో రూ. 5 వేలు పంపించాడు. కాగా, పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి స్పామ్ కాల్స్ నమ్మవద్దని, బ్యాంకు అధికారులు ఎలాంటి పర్సనల్ సమాచారం కోసం ఫోన్లు చెయ్యరని ప్రజలను సూచిస్తున్నారు.