Telangana: సైబర్ దొంగను పట్టుకుని.. రూమ్‌లో పెట్టుకున్న పోలీసులు.. కట్ చేస్తే రాత్రి సమయంలో
దొంగలను, నేరస్తులను పట్టుకోవడం పోలీసుల పని. మరి పట్టుకున్న దొంగ పారిపోతే ! పోలీసులే.. మరో పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. పోలీసులే... పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటి అనుముంటున్నారా అవును ఇది నిజం.. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో జరిగింది ఈ ఘటన.

దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను మోసం చేస్తూ ఆన్ లైన్‌లో డబ్బులు దోచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి ఉత్తరాది రాష్ట్రాలు డిల్లీ, యూపీ, హర్యానా కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉన్నాయి. ఆన్ లైన్ మోసాల కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ వచ్చిన ఏడుగురు తెలంగాణ సైబర్ వింగ్ పోలీసులు ఆదివారం ఒక సైబర్ నేరగాడు దినేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో రాత్రి బస కోసం తెలంగాణ భవన్‌కు తీసుకువచ్చారు. మాములు ప్రొటోకాల్ ప్రకారం… స్థానిక పోలిస్టేషన్‌లో సమాచారం ఇచ్చి.. కోర్టు ద్వారా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకుని నిందితులను తరలించాలి. కానీ అరెస్ట్ చేసిన సైబర్ నేరస్తుడిని తమ రూం 403 లోనే ఉంచుకొని నిద్రపోయారు తెలంగాణ పోలీసులు. తెల్లవారు జామున 1:45 కి పోలీసుల కళ్లుగప్పి నిందితుడు దినేష్ కుమార్ తప్పించుకున్నాడు.
దీంతో తప్పించుకున్న సైబర్ నేరస్తుడిని బొట్టుకునేందుకు ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ పోలీసులు. సైబర్ నేరస్తుడిని రాత్రి సమయంలో తమతో ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారు అక్కడి పోలీసులు. సీసీ ఫుటేజీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఢిల్లీ, యూపీ, హర్యానాల్లో అరెస్ట్ చేసిన సైబర్ నేరస్తులను.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తమకు కేటాయించిన రూముల్లో పెట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలోనూ తెలంగాణ భవన్ 4 వ ఫ్లోర్ నుంచి దూకి పరారయ్యేందుకు ప్రయత్నించి సైబర్ నేరస్తుడు గాయపడ్డాడు. వీవీఐపీలు, ప్రజా ప్రతినిధులు, తెలుగు ప్రజలు ఉండే భవన్‌కి పోలీసులు నేరస్తులను తీసుకురావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ, ఏపీ భవన్ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
