Crocodile Attacks: హడలెత్తిస్తున్న మొసళ్ళు.. ఇటీవల కాలంలో ఎన్నో దాడులు.. ఎలా దాడులకు దిగాయో తెలిస్తే షాకే!

తాజాగా సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో మంజీరా నదిలో మొసలి దాడికి సంబంధించి వచ్చిన కథనాల నేపథ్యంలో ఇటీవల జరిగిన మొసళ్ళ దాడుల వివరాలను సేకరించింది టీవీ9 బృందం.

  • Rajesh Sharma
  • Publish Date - 2:13 pm, Mon, 1 March 21
Crocodile Attacks: హడలెత్తిస్తున్న మొసళ్ళు.. ఇటీవల కాలంలో ఎన్నో దాడులు.. ఎలా దాడులకు దిగాయో తెలిస్తే షాకే!

Crocodile attacks across the World: ఇటీవల కాలంలో నదీ తారాల్లో, పెద్ద పెద్ద చెరువులు, సరస్సుల్లో మొసళ్ళ దాడులు పెరిగిపోతున్నాయి. అనూహ్యంగా దాడి చేసే మొసలి నుంచి ప్రాణాలను కాపాడుకోవడమంటే మాటలు కాదు. ఒక్కసారి మొసలి నోటికి చిక్కామా… అంతే ఇక ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతీసారి గజేంద్ర మోక్షం కోసం శ్రీ మహా విష్ణువు వచ్చినట్లు దేవుళ్ళు సామాన్యుల కోసం రారు కదా..! తాజాగా సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో మంజీరా నదిలో మొసలి దాడికి సంబంధించి వచ్చిన కథనాల నేపథ్యంలో ఇటీవల జరిగిన మొసళ్ళ దాడుల వివరాలను సేకరించింది టీవీ9 బృందం.

ఆదివారం (ఫిబ్రవరి 28) మంజీరానదిలో మొసలి దాడికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మంజీరా నది పుల్‌కల్‌ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. నీళ్లలోకి దిగి గేదెలను కడుగుతుండగా పశువుల కాపరి గొల్ల రాములుపై మొసలి దాడి చేసింది. ఈ దాడిలో రాములు మృతి చెందాడు. ఇదే తరహాలు గతంలోను పలు చోట్ల మొసళ్ళు దాడికి పాల్పడ్డాయి. జూన్‌ 28, 2014 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రాయిచ్ సమీపంలో తర్నియాఘాట్ వన్యప్రాణి అభయారణ్యంలో నది నీటి కోసం వెళ్లిన ఇద్దరు బాలికలపై మొసలి దాడి చేసింది. మే 28, 2019 అమెరికాలోని ఫ్లోరిడా ఫైలేక్‌ వైల్డర్‌‌నెస్‌ పార్క్‌లో స్నానం చేస్తున్న మహిళపై మొసలి దాడి చేసి చంపేసింది. ఆగస్టు, 2019 గుజరాత్‌ వడోదరలో భారీగా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయం కావడంతో సిటీకి సమీపంలోని నది నుంచి రోడ్డుపైకి మొసళ్ళు వచ్చేశాయి. ఈ సందర్భంగా ఓ కుక్కను నోట కరచుకున్న మొసలి దాన్ని దారుణంగా చంపేసింది.

మే 28, 2020 మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా అమోలాలోని సింధ్ నదిలో నీరు త్రాగడానికి వెళ్లిన మహిళపై మొసలి దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ తన చేతిని కోల్పోయి ప్రాణాలతో బయట పడింది. జూన్‌ 6, 2020 పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌ గ్రామ శివారులోని ఎల్‌. మడుగు వద్ద ఘటన గోదావరి నది ఒడ్డుకు నీటికోసం వెళ్లిన రైతుపైనా, అతని ఎద్దుపైనా మొసలి దాడికి పాల్పడింది. జూన్‌10, 2020 భోపాల్‌లోని కలియాసట్ డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులపై మొసలి దాడి చేసి చంపేసింది. జులై 27, 2020 ఒడిషా రాష్ట్రం కేంద్రపారా సమీపంలోని ఖరాస్ రోట నదిలో 15 ఏళ్ల బాలుడు స్నానం చేస్తుండగా మొసలి దాడి చేసింది. బాలుడిని నోట కరచుకొని నది లోపలకు లాక్కెళ్ళి చంపేసింది మొసలి. డిసెంబర్‌ 25, 2020 దక్షిణాఫ్రికాలోని కేఫ్‌టౌన్‌లో ఓ కుంటలో నీరు తాగేందుకు వచ్చిన చిరుతపులి పిల్లపై మొసలి దాడి చేసి, నీటిలోకి లాక్కెళ్ళిందొ మొసలి.

జనవరి 30, 2021 ఉత్తర ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌లోని లేక్ ప్లాసిడ్‌లో ఈత కొడుతుండగా దాడి చేసిన మొసలి నుంచి ఓ వ్యక్తి సాహసోపేతంగా తప్పించుకోవడం వార్తలకెక్కింది. రెండు చేతులతో బలంగా మొసలి నోరు తెరచి బయటపడి చాలా దూరం ఈదుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్న ఆ వ్యక్తిని పలువురు అభినందించారు. ఫిబ్రవరి 22, 2021 వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెలో జనావాసాల మధ్యకు వచ్చిన ఓ భారీ మొసలి కలకలం రేపింది. గ్రామానికి చెందిన గొల్ల పకీరయ్య అనే వ్యక్తి ఇంటి సమీపంలో మొసలి సంచరించింది. దాంతో గ్రామస్తులు ఆ మొసలిని తాళ్ళతో బంధించి ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చారు. వారు బంధించి తీసుకువెళ్ళారు.

ALSO READ: భద్రతా దళాల తరలింపుపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం