Security Forces Safety: భద్రతా దళాల తరలింపుపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పుల్వామా దాడి నేపథ్యంలో కొత్త ఆదేశం

భద్రతా బలగాల తరలింపు విషయంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఫిబ్రవరి 27వ తేదీన కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇక భద్రతా దళాల తరలింపు విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఉత్తర్వులిచ్చింది.

  • Rajesh Sharma
  • Publish Date - 6:28 pm, Sat, 27 February 21
Security Forces Safety: భద్రతా దళాల తరలింపుపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పుల్వామా దాడి నేపథ్యంలో కొత్త ఆదేశం

Modi government crucial decision on forces shifting: భారత దేశానికి శిఖరాగ్రంగా వున్న అందాల కశ్మీరాన్ని పరిరక్షించే కీలకమైన బాధ్యతల్లో వున్న సైన్యం సహా భద్రతా బలగాల పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే జవాన్లు సెలవులపుడు గానీ.. అత్యవసర సమయాల్లోగానీ.. సొంత ప్రాంతాలకు వెళ్ళేపుడు వారికి తగిన భద్రత కల్పించాలని నిర్ణయించింది. తద్వారా పుల్వామా లాంటి దారుణ ఉదంతాలను నివారించాలని కేంద్ర హోం శాఖ భద్రతా దళాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది.

రెండేళ్ళ క్రితం అంటే 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ భద్రతా బలగాలతో వెళుతున్న వెహికిల్ కాన్వాయ్‌పైన ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు తొత్తుగా మారి కశ్మీరీ ఆదిల్ అహ్మద్ దార్ ఓ కారులో పేలుడు పదార్థాలు అమర్చుకుని భద్రతా దళాల కాన్వాయ్‌పై దాడి చేశాడు. ఈ ఉగ్రవాద దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన జవాన్లు దుర్మరణం పాలయ్యారు. దాడికి పాల్పడిన కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ కూడా హతమయ్యాడు. విధినిర్వహణ నుంచి సెలవులపై వెళుతూ మరి కొన్ని గంటల్లో తమ కుటుంబీకులను కలుసుకోబోతున్న జవాన్లు టార్గెట్‌గా ఉగ్రదాడి జరిగింది. ఇలాంటి ఉదంతాలను నివారించేందుకు జవాన్ల తరలింపు వాయు మార్గంలో జరపాలని పలువురు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ కీలక మైన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌ నుంచి సెలవులపై ఇంటికి వెళ్లే అన్ని భద్రతా బలగాలకు చెందిన జవాన్లకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. భద్రతా బలగాల తరలింపునకు ఎంఐ-17 హెలికాప్టర్లు వినియోగించాలని ఆదేశాలలో పేర్కొన్నారు. తద్వారా వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉగ్రవాద దాడులతోపాటు ఐఈడీ పేలుళ్ల నుంచి జవాన్లకు రక్షణ కల్పించేందుకు ఈ సౌకర్యాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. జవాన్లను రోడ్డు మార్గంలో వాహనశ్రేణి ద్వారా చేరవేయడం వల్ల మ్యాగ్నెటిక్‌ ఐఈడీ, ఆర్‌సీఈఈడీల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వారి నివేదికకు అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రదాడుల నుంచి రక్షణ కోసం హెలికాప్టర్‌ సౌకర్యాన్ని వాడుకోవాలని, ఈ తరహా తరలింపునకు సంబంధించి రిక్వెస్టు వచ్చిన వెంటనే సంబంధి అధికార యంత్రాంగం వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ సూచించింది.

‘‘ నిజానికి ఈ అంశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదించింది. తాజా ఆదేశాల ప్రకారం.. జవాన్లు, అధికారుల ప్రయాణం కోసం వారంలో మూడుసార్లు బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టరు అందుబాటులో ఉంటుంది ’’ అని సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ హెలికాప్టర్‌.. జవాన్లను ఎక్కడి వరకు తీసుకెళ్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. జవాన్లు ఉండే స్థానం నుంచి జమ్ము లేదా శ్రీనగర్‌ విమానాశ్రయం వరకు చేరవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తాజా ఉత్తర్వులు అన్ని భద్రతా దళాల కేంద్ర స్థానాలకు చేరితే ఆదేశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

ALSO READ: ఇండియాకు అమెరికా అప్పు.. కీలక సమాచారాన్ని వెల్లడించిన అమెరికన్ మెంబర్

ALSO READ: అయిదు అసెంబ్లీల ఎన్నికలు.. ఏ లెక్కన చూసినా అన్ని పార్టీలకు కీలకమే

ALSO READ: సోషల్ మీడియా, ఓటీటీ చట్టంలో కొత్త మార్గదర్శకాలు.. కొత్త నిబంధనలను ఎందుకోసం? ఎవరికోసం?