‘పార్టీ బలహీనపడుతోంది, ఇది సత్యం’, గులాం నబీ ఆజాద్ సహా మళ్ళీ ‘జీ-23’ నేతల స్వరం
దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది, ఇది సత్యమని 'జీ-23' గ్రూప్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా పార్టీ బలోపేతం కావాలని వారు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో..
దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది, ఇది సత్యమని ‘జీ-23’ గ్రూప్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా పార్టీ బలోపేతం కావాలని వారు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ వంటివారు గతంలో మాదిరే పార్టీపై నిరసన గళాన్ని వినిపించారు. గత ఏడాది ఆగస్టులో పార్టీ నాయకత్వానికి, పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మొత్తం 23 మంది ‘అసంతృప్త’ నేతలు ఇలాగే లేఖ రాసి సంచలనం సృష్టించారు. మరికొన్ని వారాల్లో 5 రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వీరంతా తిరిగి పాత పాటనే ప్రస్తావించారు. పార్టీ బలహీనపడుతోందన్న విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తెచ్చేందుకే తామంతా ఇక్కడ భేటీ అయ్యాయమని కపిల్ సిబల్ అన్నారు. పార్టీని అంతా కలిసి బలోపేతం చేయాల్సి ఉందని ఆయన అన్నారు.ఇప్పటికైనా మించిపోయింది లేదని, యువత పార్టీకి కనెక్ట్ కావాలని, గతంలో పార్టీ మంచి రోజులను చూసిందని, కానీ మనం మళ్ళీ నాటి పరిస్థితులను తెఛ్చి ఉత్తేజితం చేయాలనీ పేర్కొన్నారు.
ఈ ‘ఆత్మీయ సమ్మేళనం’లో రాజ్యసభ ఎంపీ వివేక్ తాన్ఖా, మనీష్ తివారీ, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా తదితరులు పాల్గొన్నారు. యూపీలోని ఓటర్లకు,కేరళ ఓటర్లకు మధ్య చాలా తేడా ఉనంటూ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యను నేతలు పరోక్షంగా ప్రస్తావించారు. తాము జమ్మూ కాశ్మీర్ లో ఉన్నా, లడాఖ్ లో ఉన్నా.. అన్ని మతాలూ, కులాలవారిని సమానంగా గౌరవిస్తామని, అదే మన బలమని, దీన్ని కొనసాగిస్తామని ఆజాద్ అన్నారు. అంటే పార్టీలో మార్పు రావాలని ఆయన అన్యాపదేశంగా కోరారు. కపిల్ సిబల్ కూడా తన ప్రసంగంలో రాహుల్ వ్యాఖ్యలను పరోక్షంగా తప్పు పట్టారు. ఈ విధమైన వ్యాఖ్యలు పార్టీకి మంచి చేస్తాయని తాను నమ్మడంలేదన్నారు. కాగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఇప్పటి నుంచే ఇందుకు సన్నద్డం కావాలని అభిషేక్ మను సింఘ్వీ సూచించారు. మన నేతల మీద, కార్యకర్తలపైనా మనకు విశ్వాసం ఉండాలన్నారు.
ఉత్తరాది ఓటర్ల కన్నా కేరళ ఓటర్లకు సమస్యలపై ఆసక్తి ఎక్కువగా ఉందని ఇటీవల రాహుల్ తిరువనంతపురం లో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీన్ని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు తప్పు పట్టారు.