Five Assembly’s Elections: అయిదు అసెంబ్లీల ఎన్నికలు.. ఏ లెక్కన చూసినా అన్ని పార్టీలకు కీలకమే.. ఎలాగంటే?

అయిదు అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు దాదాపు అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా కనిపిస్తున్నాయి. అధికారంలో వున్న పార్టీలతో పాటు.. కొన్నేళ్ళ క్రితం అధికారం కోల్పోయిన పార్టీలకు, చాన్నాళ్ళుగా అధికారం కోసం వెంపర్లాడుతున్న పార్టీలకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై ఎలెక్షన్‌గా కనిపిస్తున్నాయి.

Five Assembly's Elections: అయిదు అసెంబ్లీల ఎన్నికలు.. ఏ లెక్కన చూసినా అన్ని పార్టీలకు కీలకమే.. ఎలాగంటే?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 27, 2021 | 3:57 PM

Crucial elections for all political parties:  దేశంలో అయిదు అసెంబ్లీలకు ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం… అంతేగా అనుకునే ఎన్నికలు కావు ఇవి. రాజకీయ ఉద్ధండులకు అత్యంత కీలకంగా మారిన ఎన్నికలు ఇవి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు.. ప్రాంతీయ పార్టీలైన తృణమూల్, డిఎంకే, అన్నా డిఎంకే, అసోం గణ పరిషత్ సహా కొన్ని ప్రాంతీయ కూటములకు (కేరళలోని యుడీఎఫ్, ఎల్డీఎఫ్, బెంగాల్‌లోని కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్ మొదలైనవి) అత్యంత కీలకంగా మారాయి ఈ అయిదు అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలు. అన్ని పార్టీలకు షాకిస్తూ వారం ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం అయిదు అసెంబ్లీలకు నిర్వహించబోయే ఎన్నికల షెడ్యూలును ఫిబ్రవరి 26వ తేదీన ప్రకటించింది.

ఇదీ ఎన్నికల నేపథ్యం..

గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదు చోట్ల (నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం) ఎన్నికల ముఖచిత్రంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో రెండు సార్లు అధికారంలో కొనసాగిన తృణమూల్‌కు ఈసారి భారతీయ జనతా పార్టీ రూపంలో సరికొత్త సవాల్‌ ఎదురవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన మెరుగైన ఫలితాలిచ్చిన ఊపుతో బీజేపీ బెంగాల్‌లో అధికారం సాధించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. అక్కడ ఒకప్పుడు తిరుగులేని పార్టీలుగా వుండి ప్రస్తుతం ఏ దారి లేక ఏకమైన కాంగ్రెస్‌-వామపక్ష కూటమి ప్రభావం పెద్దగా కనిపించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల పరిశీలన.

ఇటు దక్షిణాది వైపు చూస్తే.. పురుచ్చితలైవి జయలలిత, రాజకీయ దిగ్గజం కరుణానిధి వంటి అధినేతల మరణాలతో రాజకీయ శూన్యత ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. జయలలిత, కరుణానిధి బతికి వుండి, రాజకీయం తమదైన శైలిలో చేస్తున్నప్పుడు ధైర్యం చేయని నటుడు కమల్‌ హాసన్ సొంత పార్టీ పెట్టి తానే నెక్స్ట్ సీఎం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇందు కోసం ఆయన చిన్నా చితకా పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు యత్నాలను ముమ్మరం చేశారు. అయితే కమల్ పార్టీ ప్రభావం అంతంతేనన్న విశ్లేషణలు తమిళ మీడియాలో తరచూ దర్శనమిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే రాజకీయ ప్రవేశానికి ముందే రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యారు. దాంతో గతంలో జరిగినట్లుగానే డీఎంకే వర్సెస్ అన్నా డిఎంకే అన్నట్లుగానే ప్రస్తుతం తమిళనాడు పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన పలితాలు సాధించిన డీఎంకే అధినేత స్టాలిన్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేదే విజయం అన్న ధీమాతో వున్నారు. కానీ ఆయనకు దక్షిణ తమిళనాడులో మంచి పట్టున్న తన సోదరుడు అళగిరి సహకారం ఏ మేరకు లభిస్తుందన్నది ప్రశ్నార్థకమే. కాగా.. జయ మరణానంతరం పెద్దన్న పాత్ర పోషించడం ద్వారా అన్నా డిఎంకేకు దగ్గరైన బీజేపీ.. తమిళనాడులో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది. ఖుష్బూ లాంటి స్టార్ డమ్ వున్న సినీ తారలను పలువురిని బీజేపీ చేర్చుకుంది. రజనీకాంత్‌ని పార్టీలోకి తెచ్చుకునేందుకు యధాశక్తి ప్రయత్నించి వదిలేశారు కమలనాథులు.

ఇక కేరళలో పూర్వవైభవానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోంది. అయిదేళ్ళ క్రితం కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యుడీఎఫ్ యత్నాలను ముమ్మరం చేసింది. ఎల్డీఎఫ్ వైఫల్యాలపై గత కొన్ని నెలలుగా పోరాటాలను ఉధృతం చేసింది యుడీఎఫ్. మరోవైపు క్యాడర్‌ను నమ్ముకున్న బీజేపీ సైతం తన వంతు కృషి చేస్తోంది. అయితే ఇటీవల లోకల్ పోల్స్‌లో వచ్చిన సానుకూల ఫలితాలతో అధికార ఎల్డీఎఫ్‌ ధీమాతో కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఇటీవలే నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో ప్రవేశించిన భాజపా.. ఈ సారి అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకుంది.

అన్ని పార్టీలకు, పలువురు నేతలకు కీలకం

కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న బీజేపీకి 2021లో జరుగుతున్న అయిదు అసెంబ్లీల ఎన్నికలు కీలకం కానున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండేళ్ళ పదవీ కాలాన్ని (రెండో విడతలో) పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజాస్పందన ఎలా వుంటుందన్నది కీలకంగా మారింది. బెంగాల్‌లో దీదీని దెబ్బకొట్టడం, తమిళనాడు తొలి సారి అధికారంలో భాగస్తులవడం, కేరళలో బలమైన క్యాడర్ వున్నప్పటికీ సీట్లు పొందలేని పరిస్థితి నుంచి ఏకంగా అధికారంలోకి రావడం.. ముఖ్యంగా అసోంలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు.. ఇటీవల ప్రయోగాలు చేస్తున్న పుదుచ్ఛేరి అసెంబ్లీని కైవసం చేసుకోవడం.. ఈ లక్ష్యాల కారణంగా బీజేపీకీ ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

కాంగ్రెస్ పార్టీకి ఈ అయిదు అసెంబ్లీల ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. మొన్నటి వరకు అధికారంలో వున్న పుదుచ్ఛేరి, అయిదేళ్ళ క్రితం అధికారాన్ని కోల్పోయిన కేరళలో సత్తా చాటాల్సిన అవసరం వుందా పార్టీకి. మరోవైపు బెంగాల్‌లో 4 దశాబ్దాల క్రితం కోల్పోయిన ప్రాభవాన్ని కొంతైనా సాధించాలంటే 4 దశాబ్దాల క్రితం ఏ ఫ్రంట్ చేతిలోనైతే లేవలేని స్థాయిలో దెబ్బతిన్నదో అదే లెఫ్ట్ ఫ్రంట్ సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు పట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న అయిదు అసెంబ్లీలలోను ఒకప్పుడు అధికారంలో వున్న పార్టీ కాంగ్రెస్. పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో ఆ పార్టీ బలం దారుణంగా పడిపోయింది. అసోంలో సీఏఏ, పుదుచ్చేరిలో మొన్న ప్రభుత్వాన్ని కూలదోసిన సానుభూతితో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.

ప్రస్తుతం ఒకే ఒక్క రాష్ట్రానికి పరిమితమైన సీపీఎంకు కేరళ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇప్పటికే బెంగాల్‌, త్రిపురలో అధికారానికి దూరమై ప్రాభవం కోల్పోయిన ఆ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్‌తో కూడుకున్నవే. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చాయి. అటు బెంగాల్‌లోను కాంగ్రెస్ పార్టీతో కలిసి పరువు దక్కించుకునే స్థాయిలో సీట్లు పొందాలని సీపీఎం ప్రయత్నిస్తోంది.

బెంగాల్‌లో 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి.. రెండు సార్లు అధికారంలో వున్న తృణమూల్ కాంగ్రెస్‌కు మూడోసారి అధికారంలోకి రావడం పరువు ప్రతిష్టగా మారింది. కేంద్రంలోని మోదీతో సై అంటే సై అంటూ ఢీ కొట్టేందుకు తరచూ ప్రయత్నించిన మమతా బెనర్జీ గనక ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయపరంగా అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వుంది. బెంగాల్‌లో వెలుగు చూసిన పలు కుంభకోణాలపై దర్యాప్తు ముమ్మరం చేయడం ద్వారా ఆమెను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసే అవకాశం వుంది. 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పట్నించి పలు మార్లు ఫ్రంట్‌లు (ఎన్డీయే, యూపీఏ) మార్చిన చరిత్ర వున్న మమతా బెనర్జీ.. ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత బలమైన నేతగా ఎదిగారు. ప్రధానమంత్రినే ఢీకొట్టేందుకు ఆమె సాహసించారు. ఈక్రమంలో తాజాగా జరుగుతున్న ఎన్నికలు దీదీకి అత్యంత కీలకంగా మారాయి.

బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో ఏఐఏడీఎంకే రెండు సార్లు పదవిలో కొనసాగాయి. సో.. మూడోసారి అధికారంలోకి రావడం అంటే మాటలు కాదు. తమిళనాడులో పరిస్థితి ఈసారి భిన్నంగా వుంది. డీఎంకేకు కరుణానిధి లేరు.. ఇటు అన్నా డిఎంకే అధినేత్రి జయలలితను కోల్పోయింది. ఆ తర్వాత పరిణామాలలో బీజేపీ అండతో పదవిలో  కొనసాగిన ఫళనిస్వామికి శశికళ రూపంలో ప్రమాదం పొంచి వుంది. దానికి తోడు ఆమె నాలుగేళ్ళ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని సరిగ్గా ఎన్నికలకు ముందు తమిళనాట అడుగుమోపారు. సినీ, రాజకీయ ప్రముఖులతో ఆమె మంతనాలు  కొనసాగిస్తున్నారు. మరోవైపు విపక్ష డిఎంకే అధికారంలోకి వచ్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో తమిళనాడు రెండోసారి తాను అధికారంలోకి రావడం, మూడోసారి పార్టీని అధికారంలోకి తేవడం ఫళనిస్వామికి పెద్ద పరీక్షే. దానికి తోడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నుంచి ఫళనికి ఏ మేరకు సహకారం అందుతుందో తెలియదు.

ఇక డీఎంకే పదేళ్ళ క్రితం పదవిని కోల్పోయింది. ఆ తర్వాత పెద్దాయన కరుణానిధిని కోల్పోయింది. అయితేనేం సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో కొనసాగిన అనుభవం, తన తండ్రి నుంచి నేర్చుకున్న వ్యూహాలు కలిసి ఈసారి అధికారంలోకి రావడానికి స్టాలిన్ యత్నిస్తున్నారు. యుపీఏ భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ అండదండలు స్టాలిన్‌కు పుష్కలంగా వున్నాయి. కానీ.. సోదరుడు అళగిరి రూపంలోనే ఆయనకు ప్రమాదం పొంచి వుంది. ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ క్యాడర్‌ను రక్షించుకోవడం కష్టమేనని స్టాలిన్‌కు బాగా తెలుసు.

పుదుచ్ఛేరిలో కొన్ని రోజుల క్రితమే నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆయన పదవీచ్యుతులయ్యారు. ఆ సానుభూతితో మరోసారి ప్రజాదరణ పొందేందుకు నారాయణ స్వామి సహా కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు. ఇలా ప్రతీ నేతకు ఏదో ఒక కారణంతో ఈ అయిదు అసెంబ్లీల ఎన్నికలు అత్యంత కీలకంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ క్యూరియాసిటీ ఓ కొలిక్కి రావాలంటే మే 2వ తేదీ దాకా ఆగాల్సిందే.

ALSO READ: సోషల్ మీడియా, ఓటీటీ చట్టంలో కొత్త మార్గదర్శకాలు.. కొత్త నిబంధనలను ఎందుకోసం? ఎవరికోసం?